‘ఆ విషయం మోదీ గ్రహించాలి’

21 Dec, 2018 14:47 IST|Sakshi
సురవరం సుధాకర్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, విశాఖపట్నం: ప్రశ్నిస్తున్న ప్రగతిశీలవాదులను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం హత్య చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజున ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, స్వతంత్ర సంస్థల ఉనికి ప్రమాదంలో పడిపోయిందన్నారు. నాలుగేన్నరేళ్ల కాలంలో దేశంలో ధనవంతులు మరింత ధనవంతులయ్యారని, పేదలు మాత్రం నిరుపేదలుగా మారిపోయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

జీడీపీ ఒక్కటే అభివృద్ధికి కొలమానం కాదనే విషయాన్ని మోదీ గ్రహించాలని హితవుపలికారు. ఉద్యోగాల కల్పన పూర్తిగా తగ్గిపోయిందని, నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగిందని తెలియజేశారు. బీజేపీని గద్దెదింపే తరుణం ఆసన్నమైందన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వామపక్షాల ఐక్యతతోపాటు విశాల ఐక్యతను ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అభిప్రాయ బేధాల కారణంగా తెలంగాణ ఎన్నికల్లో వామపక్షాల ఐక్యత కుదరలేదని తెలిపారు. 

మరిన్ని వార్తలు