బలహీన పడిన పెథాయ్‌ తుపాను

17 Dec, 2018 15:45 IST|Sakshi

సాక్షి, అమరావతి:  వేగంగా దూసుకొస్తూ తీవ్ర ఉత్కంఠ రేపిన పెథాయ్‌ తుపాను ఎట్టకేలకు బలహీన పడింది. తీవ్ర వాయుగుండంగా మారి కాకినాడ సమీపంలో కేంద్రీకృతమైంది. ఈశాన్య దిశగా పయనిస్తూ, సోమవారం రాత్రి తునికి సమీపంలో తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. క్రమేణా బలహీన పడుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల పన్నెండు గంటల్లో ఉత్తర కోస్తా, యానాంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావారణ అధికారులు తెలిపారు. ఇక పెథాయ్‌ తుపాన్‌ ధాటికి సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వివిధ ప్రాంతాల్లో పెథాయ్‌ తుపాన్‌ అప్‌డేట్స్‌ ఇవి..

ఉప్పొంగి గ్రామానికి చేరువగా వచ్చిన సముద్రం!
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నడుమూరు వద్ద సముద్రం ఉప్పొంగి.. గ్రామ సమీపంలోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అలల తాకిడికి ఒడ్డున లంగరు వేసిన బోట్లును సముద్రంలోకి కొట్టుకుపోయాయి. దీంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తిత్లీ తుపాన్ సమయంలోనూ సముద్రం ఇంతగా ముందుకురాలేదని, పెథాయ్ తుపాన్ తీవ్రంగా ఉండటంతోనే ఈ పరిస్థితి నెలకొందని మత్య్సకారులు అంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం
పెథాయ్‌ తుపాన్ ధాటికి తూర్పు గోదావరి జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 33,448 హెకార్లలో ఖరీఫ్‌ పంటకు నష్టం వాటిల్లింది. రూ.33 కోట్లు విలువైన చేసే ధాన్యం తడిసి ముద్దయింది. రూ. ఆరు కోట్ల విలువ పత్తిపంట తుడిచిపెట్టుకుపోయింది. రూ. రెండు కోట్లు విలువ చేసే పొగాకు పంట నష్టం వాటిల్లింది. రూ. కోటి తొంభై ఏడు లక్షల విలువ చేసే ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.

పెథాయ్‌ వల్ల శ్రీకాకుళంకు వరద ముప్పు
పెథాయ్‌ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు వరద ముప్పు ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  జిల్లా కలెక్టర్ కె. ధనంజయ రెడ్డి హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహాయ చర్యలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నాగావళి, వంశధార, బహుదా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 


విజయవాడలో జలమయమైన రోడ్లు..
పెథాయ్‌ తుపాన్‌ ధాటికి విజయవాడలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మొగల్ రాజపురం వద్ద అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు చొచ్చుకొని రావడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకాశ్ నగర్, సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు వచ్చింది. వన్‌టౌన్‌లో దుకాణాల్లోని నీరు రావడంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నామని విజయవాడ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నా.. పరిస్థితి మాత్రం ఘోరంగా ఉందని బాధితులు అంటున్నారు. వర్షం తగ్గితేకానీ నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు.


తుపాను వల్ల వీచిన చలిగాలులకి తట్టుకోలేక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చింతపాడు వద్ద దాదాపు వెయ్యి గొర్రెలు మృతి చెందాయి.


ఏడుగురు మత్స్యకారులు ఆచూకి లభ్యం
చేపల వేటకు వెళ్లి కనబడకుండా పోయిన కాకినాడకి చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకి లభ్యమైంది. గత గురువారం వేటకు వెళ్లిన వీరు అల్లవరం మండలం సీతారామపురం వద్ద సరక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్యే వీరయ్య
పెథాయ్‌ తుపాను కారణంగా నష్టపోయిన వరి, మిరప పంటచేలను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం. వీరయ్య పరిశీలించారు. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలంలో పర్యటించి నష్టపోయిన రైతును పరమార్శించారు. పంట నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాం: ఎస్పీ రవి ప్రకాశ్‌
తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్‌ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన భీమవరం, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల మండలంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన 300 మంది సివిల్‌ పోలీసులను సహాయక చర్యల్లో నియమించామని తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

రోడ్లకు ఎటువంటి నష్టం కలగలేదు :  కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌
పెథాయ్‌ తుపాను కాట్రేనీకోన వద్ద తీరాన్ని తాకడంతో జిల్లాకు కొంత ఉపశమనం కలిగిందని పశ్చిమగోదావరి కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ అన్నారు. సోమవారం ఆయన నర్సాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి జిల్లాలో తుపాను పరిస్థితిని సమీక్షించారు. తుపాను తీవ్రత వల్ల రోడ్లకు ఎటువంటి నష్టం కలుగలేదన్నారు. కొన్ని చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని, వెంటనే పునరుద్ధరించామని చెప్పారు. ఆచంట, పాలకొల్లు పోడూరు, పెనుగొండ మొదలగు మండలాలలో భారీ వర్షం కురిసిందని, పరిస్థితిపై ఇంకా కొంత జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు.

కాకినాడను తాకిన పెథాయ్‌
పెథాయ్‌ తుపాన్‌ కాకినాడ‌ను తాకింది. దీంతో కాకినాడ న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయ్‌. మ‌రో రెండు గంట‌లపాటు కాకినాడ ప్రాంతంలో పెథాయ్‌ తుఫాన్‌ తీవ్ర ప్రభావం  చూపిస్తుందని, ప్రజ‌లంతా అప్రమత్తంగా ఉండాలని, సుర‌క్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌దని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సూచించింది.

తీవ్ర ప్రభావం చూపే అవకాశం
పెథాయ్‌ తుపాన్‌ ప్రభావంతో గంటకు 80 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయని, మరో రెండు గంటలపాటు తుపాన్‌ కాకినాడపై తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. గాలుల ధాటికి విద్యుత్‌ స్తంభాలు, సెల్‌ ​టవర్లు, కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఆలయ ధ్వజ స్తంభం కూలిపోయింది.  తుపాన్‌ తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. తుపాన్‌ తీరం దాటడంతో కాకినాడు, యానాం, తుని మండలాల్లో రానున్న రెండు గంటలపాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాన్‌ ప్రభావంతో మరోవైపు విజయవాడలోనూ భారీ వర్షం కురుస్తోంది.

పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
తుపాన్‌ తీరం దాటే సమయంలో కొనసీమపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాజోలు, స‌ఖినేటిప‌ల్లి, అమ‌లాపురం, మ‌లికిపురం, అంబాజీపేట‌, మామిడికుదురు, అల్లవ‌రం, కాట్రేనికోన, ఉప్ప‌ల‌గుప్తం మండ‌లాల్లో మ‌రో గంట‌లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. కాట్రేనికోనలో కారుపై విద్యుత్‌ స్తంభం కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
    
విజయనగరం జిల్లా:  పెథాయ్‌ తుపాను ప్రభావంతో పూసపాటిరేగ మండలంలో భారీ ఈదురు గాలులు..  దీంతో పెద్ద ఎత్తున నేలకొరిగిన  మెుక్కజొన్న పంట

బాధితులకు వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
కాకినాడ: దుమ్ములపేటలో వైఎస్సార్‌సీపీ కాకినాడ సిటీ కో-ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యటించి.. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలను పరామార్శించారు. వెంటనే ‌అధికారులు స్పందించి తుపాన్‌లో చిక్కుకున్న వారిని రక్షించాలని ఆయన కోరారు. కాగా, తుపాన్ ప్రభావిత గ్రామాల్లో పిఠాపురం వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు పర్యటించారు. తుపాన్ సహాయక కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులను ఆయన  పరామార్శించారు. ఉదయం నుండి అధికారులు తమకు ఎటువంటి ఆహరం, త్రాగునీరు అందించలేదని దొరబాబుకు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ఆయన బిసెట్లు, త్రాగునీరు అందించారు.
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు