టీమిండియా పట్టు చేజారినట్లేనా?

17 Dec, 2018 15:44 IST|Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు సడలినట్లే కనబడుతోంది. ఆసీస్‌ నిర్దేశించిన 287 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. భారత్‌ విజయానికి ఇంకా 175 పరుగులు అవసరం కాగా, చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం హనుమ విహారి( 24 బ్యాటింగ్‌; 58 బంతుల్లో 4 ఫోర్లు), రిషబ్‌ పంత్‌(9 బ్యాటింగ్‌; 19 బంతుల్లో) క్రీజ్‌లో ఉన్నారు. మంగళవారం ఐదో రోజు ఆటలో విహారి-పంత్‌లు భారీ భాగస్వామ్యం సాధిస్తే కానీ భారత్‌ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టం. ఒకవైపు పిచ్‌పై విపరీతమైన పగుళ్లు ఏర్పడటంతో లయన్‌ మరోసారి విజృంభించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మిగతా ఐదు వికెట్లతో మ్యాచ్‌ను భారత్‌ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌గా నిష్క్రమించగా, చతేశ్వరా పుజారా(4), విరాట్‌ కోహ్లి(17), మురళీ విజయ్‌(20)లు సైతం పెవిలియన్‌ బాట పట్టారు. మిచెల్‌ స్టార్క్‌ వేసిన తొలి ఓవర్‌ నాల్గో బంతికి రాహుల్‌ పెవిలియన్‌ చేరగా,  హజల్‌వుడ్‌ బౌలింగ్‌లో పుజారా కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో మురళీ విజయ్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది.

కాగా, వీరిద్దరూ 35 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి మూడో వికెట్‌గా ఔటయ్యాడు. నాథన్‌ లయన్‌ బౌలింగ్‌ స్లిప్‌ క్యాచ్‌ కోహ్లి పెవిలియన్‌ చేరాడు. ఆపై మరొకసారి టీమిండియాకు లయన్‌ షాకిచ్చాడు. విజయ్‌ను బౌల్డ్‌ చేసి భారత్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఇక ఐదో వికెట్‌గా అజింక్యా రహానే(30) పెవిలియన్‌ చేరాడు. హజల్‌వుడ్‌  బౌలింగ్‌లో హెడ్‌కు క్యాచ్‌ ఇచ్చిన రహానే ఔటయ్యాడు. భారత్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో లయన్‌, హజల్‌వుడ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా,  స్టార్క్‌కు వికెట్‌ దక్కింది. అంతకుముందు ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 132/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్‌.. మరో 111 పరుగుల్ని జోడించి మిగతా ఆరు వికెట్లను నష్టపోయింది.  మహ్మద్‌ షమీ ఆరు వికెట్లు సాధించగా, బూమ్రా మూడు, ఇషాంత్‌ శర్మ వికెట్‌ తీశాడు.

మరిన్ని వార్తలు