-

రోడ్డెక్కిన దళిత మహిళలు

2 Oct, 2014 01:48 IST|Sakshi
రోడ్డెక్కిన దళిత మహిళలు

తనకల్లు: మీటర్లను బిగించుకోలేదన్న కారణంగా అధికారులు మండల కేంద్రంలోని దళితవాడకు వారం రోజులుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనిని నిరసిస్తూ ఆ కాలనీ మహిళలు బుధవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లోని 205 జాతీయ రహదారిపై బైఠాయించి రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఆందోళనకారులు మాట్లాడుతూ కాలనీలో 500 కుటుంబాలవారు జీవిస్తున్నారన్నారు. విద్యుత్ లేకపోవడంతో వృద్ధులు, పిల్లలు, మహిళలు రాత్రిపూట బయటకు రావడానికి బయపడుతున్నారన్నారు.

సోమవారం గ్రీవెన్స్‌ను అడ్డుకుని తాహశీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపినా ఏ అధికారి  పట్టించుకోక పోవడంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన విరమించాలని ఎస్‌ఐ వెంక టప్రనసాద్ చెప్పినా వారు వినలేదు. ట్రాన్స్‌కో అధికారులు వెంటనే వచ్చి దళితవాడకు విద్యుత్ పునరుద్ధరిస్తేగాని ఇక్కడి నుంచి కదిలేదిలేదని ఎండను సైతం లెక్కచేయకుండా వారు భీష్మించారు. తహశీల్దార్ శివయ్య, ఈఓపీఆర్‌డీ ఆదినారాయణలకు ఎస్‌ఐ సమాచారం అందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. తహశీల్దార్ ట్రాన్స్‌కో అధికారులతో ఫోన్‌లో సంప్రదించి దళితవాడకు వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని ఆదేశించారు.  విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని, అయితే నెల రోజుల్లో విద్యుత్ మీటర్లు బిగించుకోవాలని తహశీల్దార్,ఈఓ పీఆర్‌డీ గడువు ఇవ్వడంతో కాలనీవారు ఆందోళన విరమించారు.


 

మరిన్ని వార్తలు