పట్టపగలే రూ. ఆరులక్షల చోరీ

6 Aug, 2014 00:38 IST|Sakshi

గుంటూరురూరల్ : పట్టపగలు నగర నడిబొడ్డున అందరూ చూస్తుండగానే బ్యాంకునుంచి డ్రా చేసుకుని వచ్చిన రూ.ఆరులక్షల నగదును ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి చోరీ చేసిన సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎదుట మంగళవారం జరిగిన సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్‌వీఎన్ కాలనీ సమీపంలోని నేతాజీ నగర్ ప్రాంతానికి చెందిన తోటా వెంకటేశ్వరరావు రెండేళ్లుగా జేకేసీ కళాశాల రోడ్డులోని వెల్ గ్రౌన్ స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో(మిర్చి కంపెనీలో) గుమస్తాగా పని చేస్తున్నారు.
 
 రోజూ మాదిరిగానే ఉదయం 10 గంటలకు విధులకు వెళ్లి 11.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై లక్ష్మీపురంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చేరుకుని, కంపెనీ ఇచ్చిన రూ.ఆరు లక్షల చెక్‌ను నగదు రూపంలో మార్చారు. డబ్బు బ్యాగ్‌ను తీసుకుని తన ద్విచక్ర వాహనంపై ముందుభాగంలో పెట్టుకుని బృందావన్ గార్డెన్స్ వైపునకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇద్దరు గుర్తు తెలియని యువకులు బజాజ్ పల్సర్‌పై వచ్చి డబ్బు ఉన్న బ్యాగ్‌ను అపహరించి పరారయ్యారు. పల్సర్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన నుంచి తేరుకున్న వెంకటేశ్వర్లు పరారవుతున్న ఆగంతకులను కొంత దూరం వెంబడించాడు. వారిని అందుకోలేపోవడంతో తిరిగి బ్యాంక్‌కు చేరుకుని అధికారులకు జరిగిన సంఘటన తెలిపారు.
 
  సమాచారం తెలుసుకున్న అర్బన్ జిల్లా ఏఎస్‌పీ బి.శ్రీనివాసులు, అర్బన్ క్రైం డీఎస్పీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాలు, పట్టాభిపురం సీఐ బిలాల్లుద్దీన్, ఎస్‌బీ సీఐ రాజశేఖర్, సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. అపహరణ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లోని పుటేజ్‌లో బ్యాంక్ ప్రాంగణం తప్ప, ఆగంతకులు డబ్బు బ్యాగ్‌ను లాక్కెళ్లిన దృశ్యాలు కనిపించలేదు.
 
సెక్యూరిటీ నిల్...
 గతంలో ఇదే బ్యాంకు వద్ద ఇలాంటి సంఘటనలే గతంలో మూడుసార్లు చోటు చేసుకున్నాయి.  దొంగతనాలు జరుగుతున్నాయని, ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ పోలీసులు బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులను సైతం బ్యాంక్ అధికారులు తొలగించడం గమనార్హం.
 
 ముమ్మరంగా వాహనాల తనిఖీ
 లక్ష్మీపురంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద చోరీకి పాల్పడిన ఆగంతకుల కోసం పోలీసులు
 గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని రహదారుల్లో వాహన తనిఖీలు చేపట్టారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేసి దొంగతనానికి పాల్పడ్డ వారి ఆచూకీ సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
 

మరిన్ని వార్తలు