బీపీటీకి భలే గిరాకీ

3 Dec, 2023 03:05 IST|Sakshi

రికార్డుస్థాయిలో ధాన్యం ధర 

బస్తా రూ.1,820కు కొనుగోలు 

2014–15లో రూ.950 మాత్రమే 

అప్పటితో పోలిస్తే రెట్టింపయిన వైనం 

వర్షాభావ పరిస్థితుల్లోనూ పెరిగిన దిగుబడులు 

దివిసీమ రైతుల్లో ఆనందం

అవనిగడ్డ: బీపీటీ ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుండడంతో ‘దివిసీమ’ రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా­రు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో సైతం అధిక దిగుబడులు రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియో­జకవర్గంలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో ఈ ఏడాది 62,548 ఎకరా­ల్లో బీపీటీ–5204 వరి రకాన్ని సాగు చేశారు.

ఈ సంవత్స­రం సరిగా వర్షాలు పడకపోయినా ఇరిగేషన్‌శాఖ అధికారులు రైతు­లను సమన్వయ పరచి వంతుల వారీ విధానం ద్వారా సాగు­నీరు అందించారు. దివిసీమలోని పలు ప్రాంతాల్లో నాలు­గు రోజుల నుంచి యంత్రాలతో వరికోత పనులు ము­మ్మరం చేశారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎకరాకు ఐదు బస్తాల దిగుబడి పెరిగినట్లు కోడూరుకు చెందిన రైతులు తెలిపారు.  

2014తో పోలిస్తే రెట్టింపైన ధర..  
2014–15 చంద్రబాబు పాలనలో సాధారణ వరి రకం క్వింటా రూ.1,360 ఉండగా, బస్తా ధాన్యం రూ.850కి కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్‌ రకం క్వింటా రూ.1,400 ఉండగా బస్తా ధాన్యం రూ.950కి కొన్నారు. 2022–23 నాటికి సాధారణ రకం రూ.2,040 ఉండగా, ఏ గ్రేడ్‌ రకం రూ.2,060 ఉంది. 2023–24లో సాధారణ రకం రూ.2,183 ఉండగా, ఏ గ్రేడ్‌ రకం రూ.2,203 ఉంది.

అంటే 2014తో పోలిస్తే సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.823 ధర పెరగ్గా, ఏ గ్రేడ్‌ రకానికి క్వింటాల్‌కు రూ.803 ధర పెరిగింది. 2014తో పోలిస్తే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బస్తాకు ధర రెట్టింపు స్థాయిలో పెరిగింది. కాగా, గతేడాది «కోతల తరువాత నాలుగైదు నెలలకు బస్తా రూ.1,800 ధర పలకగా, నేడు యంత్రాలతో కోసిన ధాన్యాన్ని కల్లంలోనే రూ.1,820కు కొంటుండడంతో రైతులు పట్టరాని ఆనందంలో ఉన్నారు.

మిషన్‌కోత ధాన్యం ఇంత ధర పలకడం ఎప్పుడూ చూడలేదు..   
ఆరున్నర ఎకరాల్లో వరిపంట సాగు చేశాం. మిషన్‌తో వరికోత కోశాం. ఎకరాకు 35 బస్తాల దిగుబడి వచి్చంది. బస్తా ధాన్యం రూ.1,820కి అమ్మేశాం. మిషన్‌కోత ధాన్యం ఇంత రేటు పలకడం నేను ఎప్పుడూ చూడలేదు.  –మాలే రాధాకృష్ణ, ఇస్మాయేల్‌బేగ్‌పేట, కోడూరు మండలం   

ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు.. 
రెండెకరాలు కౌలుకు సాగు చేశాను. గతేడాదితో పోలిస్తే ఖర్చులు తగ్గి.. దిగుబడులు పెరిగాయి. యంత్రాలతో కోసిన ధాన్యంను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ ధరకు కొంటున్నారు. – జుజ్జువరపు రామస్వామి, కౌలురైతు, వెంకటాపురం, మోపిదేవి మండలం

మరిన్ని వార్తలు