కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి

3 Dec, 2023 03:28 IST|Sakshi

సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో తుపాను కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తుపాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం సీఎస్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. సీఎస్‌ మాట్లాడుతూ తుపాను ప్రభావం తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలపై ఉంటుందని చెప్పారు.

మిగ­తా జిల్లాల్లోను ఒక మాదిరి వర్షాలు పడే అవకాశముందన్నారు. కావున అధికారులు అంతా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు చేర్చేలా చూడాలని సీఎస్‌ చెప్పారు. కోతకోసి పనలపై ఉన్నవారి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో కూడా రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

వివిధ నిత్యావసర సరుకులను జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని.. ఎక్కడైనా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకు ఒరిగి రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగితే వెంటనే వాటిని తొలగించి ట్రాఫిక్‌ పునరుద్ధరణకు అవసరమైన యంత్రాలు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్, టెలికం తదితర శాఖలను ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్‌ మాట్లాడుతూ తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు.

ఆర్థిక, వ్యవసాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎస్‌ రావత్, గోపాలకృష్ణ ద్వివేది, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, భారత వాతావరణ శాఖ అమరావతి డైరెక్టర్‌ స్టెల్లా, ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.  

విద్యుత్‌ శాఖ హైఅలర్ట్‌ 
మరోవైపు.. మిచాంగ్‌ తుపానుపై విద్యుత్‌ శాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను పీడిత ప్రాంతాల్లోని మండలాల్లో 11కేవీ స్తంభాలు, లైన్లు, డీటీఆర్‌లు దెబ్బతింటే వాటిని పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.  

ఇక తుపాను సమయంలో లైన్‌మెన్‌ నుంచి చైర్మన్‌ వరకు ఎవరికీ సెలవులు ఉండవని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబుతో మిచాంగ్‌ తుపాను సంసిద్ధతపై శనివారం ఆయన సమీక్ష జరిపారు. 

మరిన్ని వార్తలు