ఆన్‌లైన్‌లో డిగ్రీ ప్రవేశాలు

21 Feb, 2018 13:49 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వీసీ ప్రొఫెసర్‌ రామ్‌జీ

వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

డిగ్రీ కాలేజీల్లో విద్యాప్రమాణాలు మెరుగుపడాలి

ప్రిన్సిపాళ్లు, కార్యదర్శులతోఅంబేడ్కర్‌ వర్సిటీ వీసీ రామ్‌జీ

శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్‌: వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూ నివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కూన రామ్‌జీ తెలిపారు. వర్సిటీ సెమినార్‌ హా ల్లో మంగళవారం జిల్లాలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో కలిపి సుమారు 56 వేల మంది విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారని, ఆయితే విద్యాప్రమాణాలు మాత్రం సంతృప్తిగా లేవని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యా మండలి కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుడుతోందన్నారు. దీనిలో భాగంగా ఆన్‌లైన్‌లో ప్రవేశాలు చేపట్టనున్నామన్నారు.

ఇందుకు సెట్‌ నిర్వహించా లా.. ఇంటర్‌ మార్కుల ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలా.. అన్న అంశంపై కసరత్తులు జరుగుతున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే చర్యల్లో భాగంగా క్లాస్‌వర్కు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తప్పనిసరిగా విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు అమలు చేస్తామని స్పష్టం చేశారు. డిగ్రీ కళాశాల్లో స్టాఫ్‌ రేటిఫికేషన్‌ ఉంటుందని, అర్హులైన అధ్యాపకులే బోధించాలన్నారు. రిజిస్ట్రార్‌ తులసీరావు మాట్లాడుతూ రాష్ట్రం యూనిట్‌గా అకడమిక్‌ క్యాలెండర్, సిలబస్, పరీక్షలు నిర్వహణ అమలు చేస్తామని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పెద్దకోట చిరంజీవులు, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్‌ తమ్మనేని కామరాజు, ఎం.బాబూరావు, కె.వి.అప్పలనాయుడు, పి.జయరాం, ఆమదాలవలస డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ బమ్మిడి పోలీస్‌ తదితరులు పాల్గొన్నారు.

28న సైన్స్‌ ఎగ్జిబిషన్‌
వర్సిటీలో ఈ నెల 28న నిర్వహించనున్న సైన్స్‌ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని వీసీ రామ్‌జీ కోరారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(న్యూఢిల్లీ, హైదరాబాద్‌)కు చెందిన పల్సస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నూతన ఆవిష్కరణల నేపథ్యంలో ప్రయోగాల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.

సర్వేల వల్ల ప్రయోజనం లేదు
డిగ్రీ విద్యార్థులను ఓడీఎఫ్‌ ప్రచారం కోసం గ్రామాల్లో ర్యాలీలు, సర్వేలు నిర్వహించాలని వర్సిటీ అధికారులు సూచించగా, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సర్వేలు వల్ల ప్రయోజనం ఉండటం లేదన్నారు. వీరి జాబితాలకు సైతం అధికారులు స్పందించడం లేదని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు సైతం గ్రామాల్లో తమ సర్వేలు సరిపోతాయని, విద్యార్థులు ఎందుకు వస్తున్నారని అంటున్నారని గుర్తు చేశారు. మరుగుదొడ్లు లేనివారికి నిధులు అందజేసే అవకాశం విద్యార్థులకు లేనపుడు ఇంటింటా సర్వేలు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. దీనిపై వర్సిటీ అధికారులు స్పందిస్తూ విద్యార్థులు సర్వేలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు