తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధూళిపాళ్ల

13 Mar, 2018 13:49 IST|Sakshi

అతిసార వ్యాధి నివారణపై విఫలమైన అధికార యంత్రాంగం

సాక్షి, అమరావతి : గుంటూరులో అతిసార వ్యాధిపై మున్సిపల్ శాఖ వ్యవహరించిన తీరును అధికార పార్టీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తప్పుపట్టారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో  కాలింగ్ అటెన్షన్ ద్వారా అతిసార విషయాన్ని ప్రస్తావించారు. అధికార యంత్రాంగం అతిసార నివారణకు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే కొందరి ప్రాణాలైనా రక్షించేగలిగేవారని తెలిపారు.

‘ఈ-కొలి బ్యాక్టిరీయా కారణంగా కిడ్నీలు కూడా దెబ్బ తిన్నాయనే ప్రచారం జరుగుతోంది. అతిసార వ్యాధి ప్రబలడానికి అధికారులు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరులో అతిసార వ్యాధితో 10 మంది చనిపోతే సభలో కనీస ప్రస్తావన లేకపోవడం బాధాకరం. అసెంబ్లీలో అరకొర సమాధానం ఇవ్వడం సరైన పద్దతి కాదు’ అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 కాగా రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరుకు అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ (యూజీడీ) మంజూరైందనగానే నగర ప్రజలు ఎంతో ఆనందించారు. అయితే యూజీడీ పనులు జరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్నారు. రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి, పైపులైనులు వేసిన అనంతరం జరిగా పూడ్చకపోవడంతో నగరం మొత్తం గుంతలమయంగా మారింది. యూజీడీ పనుల కోసం చేపట్టిన తవ్వకాల వల్ల భూమిలోని తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా తాగునీటిలోకి మురుగు చేరింది. దీంతో నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా వృద్ధి చెందింది. ఈ బ్యాక్టీరియా కారణంగానే నగరంలో డయేరియా వ్యాధి ప్రబలి తొమ్మిది మందిని బలితీసుకుంది.

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పైపులైనులు లీకై మురుగునీరు చేరింది. దీంతో తాగునీరు కలుషితమైంది. ఆ నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా చేరింది. ఈ బ్యాక్టీరియా కారణంగా వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డారని డీఎంహెచ్‌ఓ జొన్నలగడ్డ యాస్మిన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. తమ ప్రాంతాల్లో సైతం యూజీడీపనుల వల్ల పైపులైనులు లీకవడం, పగిలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు