అతీగతీలేని ‘పంట సంజీవిని

21 May, 2016 02:21 IST|Sakshi

లక్ష్యానికి దూరంగా ఫారం పాండ్స్
నిర్మించాల్సినవి 15949 ఇప్పటి వరకు తవ్వినవి 24
{పచారానికే పరిమితం

 

నీటిలోటును పూడ్చే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం అట్టహాసంగా పొలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన పంటసంజీవినికి అతీగతీలేకుండా పోయింది. లక్ష్యానికి ఆమడ దూరంలో ఈపథకం మూలుగుతోంది. నెలాఖరుకు లక్ష్యాన్ని పూర్తి చేయాలంటూ ప్రభుత్వం హడావుడి చేస్తే జిల్లాలో మాత్రం కనీసం అడుగు ముందుకు పడని దుస్థితి.

 

విశాఖపట్నం : పంట సంజీవిని పథకం కింద వేసవిలో జిల్లా వ్యాప్తంగా 20వేల పంటగుంతలు (ఫారం పాండ్స్) తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకంలో వీటి నిర్మాణానికి అవసరమైన పరిపాలనామోదం కూడా ఇచ్చింది. నీరు-ప్రగతి పేరుతో జిల్లాల వారీగా సదస్సులు..మండలాలవారీగా సమావేశాలు పెట్టి రైతులను  చైతన్య పరిచేందుకు కార్యక్రమాలు సైతం నిర్వహించారు. కానీ ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. కనీవినీ ఎరుగని రీతిలో వేసవిలో కరవు విలయతాండ వం చేయడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ వేసవి ముగిసే లోగా యుద్ధప్రాతిపదిక న ఇంకుడుగుంతలు, పంట గుంతలు తవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చివరకు రూ.117.98 కోట్ల అంచనాతో 15,949 పనులకు పరిపాలనామోదం ఇచ్చారు. గుంత సైజును బట్టి రూ.45వేల నుంచి రూ.1.05లక్షల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు.తమపొలంలో ఈ గుంత తవ్వుకునేందుకు ఏ రైతు ముందుకొస్తారో ఆ రైతుకు ముందుగా జాబ్‌కార్డు జారీ చేస్తారు. ఆ తర్వాత  గుంత సైజును బట్టి పరిపాలనామోదం ఇచ్చిన తర్వాత ఉపాధి కూలీలతో కలిసి ఫారంపాండ్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. తవ్వగా వచ్చిన మట్టిని పూర్తిగా పొలం గట్లను ఎత్తు చేసు కునేందుకు ఉపయోగించుకోవచ్చు. జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాన్ని నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయించారు.


కానీ జిల్లాలో ఇంకుడుగుంతలు ప్రచారాానికే పరిమితం కాగా..పంట గుంతల జాడలేకుండా పోయింది. జిల్లాలో మే నెలాఖరు కల్లా పంటగుంతల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ రైతుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. వారిని చైతన్య పర్చడంలో అధికారులు కూడా ఘోరంగా విఫలమయ్యారు. జిల్లాలో ప్రస్తుత  సీజన్‌లో 15,949 పంట గుంతలు నిర్మించేందుకు పరిపాలనామోదం ఇవ్వగా.. అతికష్టంమీద 2154 పనులను మాత్రమే చేపట్ట గలిగారు. ఇప్పటివరకు రూ.3.17కోట్లు ఖర్చు చేసి కేవలం 24 పంటగంతల నిర్మాణం మాత్రమే పూర్తి చేయడం ద్వారా లక్ష్యంలో 10.89 శాతాన్ని కూడా అధిగమించలేక పోయారు. ఈసారి వర్షాలు బాగుంటాయని  పది రోజుల ముందుగానే తొలకరి పలుకరిస్తుందని వాతావరణశాఖ చెప్పడంతో ఎలాగైనా సరే నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పంటగుంతలు తవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం కనిపించలేదు. తమ పంటపొలాల్లో పంటగుంతలు తవ్వుకోవాలని భావించినా స్థానిక అధికారులు సవాలక్ష కొర్రీలు వేస్తునారని మాకవరపాలెంనకు చెందిన లక్ష్మణరావు అనే రైతు సాక్షి వద్ద వాపోయారు. కూలీలకు వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని చెబుతున్నారు. అందువల్లే రైతులు ఆసక్తి చూపడం లేదంటున్నారు.

>
మరిన్ని వార్తలు