ప్రజెంటేషన్లలో కాదు పనుల్లో అభివృద్ధి చూపండి

30 Sep, 2016 02:10 IST|Sakshi
ప్రజెంటేషన్లలో కాదు పనుల్లో అభివృద్ధి చూపండి

కలెక్టర్లు, మంత్రులపై సీఎం ఆగ్రహం
* కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు రావాలి
* లక్ష్యాలు సాధించలేదంటూ గంటాపై మండిపాటు
* యూనివర్సిటీలకు ర్యాంకులపై వీసీలకు అభినందన

సాక్షి, అమరావతి: జిల్లాల్లో అభివృద్ధిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లలో కాకుండా పనుల్లో చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు  మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలనపై దృష్టి పెట్టాలని, జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో కలెక్టర్లు ముందుకు రావాలని ఆదేశించారు.

మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, కలెక్టర్లు ఉమ్మడిగా అభివృద్ధి  ప్రణాళిక రూపొందించి అమలుకు  కార్యాచరణ రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు గురువారం విజయవాడలో జరిగింది. సమావేశంలో జిల్లాల వారీగా ప్రగతిని చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు ఏడేసి నిమిషాలు తమ జిల్లాపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదే సమావేశంలో విశ్వవిద్యాలయాల ఉప కులపతులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో విడిగా సమావేశమయ్యారు. జిల్లాల్లో మంత్రులు, పార్టీ నేతల మధ్య విభేదాలు నెలకొని అభివృద్ధికి ఆటంకంగా మారితే పరిష్కారానికి చొరవ చూపాలని వారికి సూచించారు. ఆ తర్వాత రాత్రి పొద్దు పోయే వరకూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. ఆధార్ ఆధారంగా ఇంటినుంచే పౌరసేవలను అందించే యాప్‌ను తయారు చే యించిన పశ్చిమ గోదావరి కలెక్టర్   భాస్కర్‌ను అభినందించారు.
 
మూడేళ్లవుతున్నా ఏం సాధించారు?
అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా, వేలకోట్లు బడ్జెట్ ఇస్తున్నా... అనుకున్న లక్ష్యాల్లో ఒక్కటైనా సాధించారా? అంటూ మానవవనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించి మూడేళ్లయినా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీలకు ప్రపంచస్థాయి ర్యాంకులు రావడంపై వీసీలను, ఉన్నత విద్యాశాఖ అధికారులను అభినందించారు.
 
సైనికులకు వందనం : దేశ సార్వభౌమాధికారానికి ఎవరి నుంచి ఎటునుంచైనా భంగం వాటిల్లితే సమర్థంగా ఎదుర్కొంటామని మరోసారి రుజువు చేసిన సైనికులకు వందనాలు అర్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్వాగతించారు. ముఖ్యమంత్రి స్వచ్ఛభారత్‌పై నిర్వహించే సమావేశంలో పాల్గొనే నిమిత్తం శుక్రవారం ఢి ల్లీ వెళ్లనున్నారు.
 
వృద్ధి రేటులో విశాఖ ప్రథమం..
రాష్ట్రంలోని జిల్లాలకు వృద్ధి రేటు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా రెండవ స్థానంలోను, పశ్చిమ గోదావరి జిల్లా మూడో స్థానంలోను నిలిచాయి. వాటి తరువాత నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలు వరస స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని వార్తలు