పనబాకపై భగ్గు..భగ్గు

15 Feb, 2014 02:05 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కేంద్రమంత్రి పనబాక లక్ష్మిపై జిల్లావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి మేలు చేయకపోగా..సమైక్యాంధ్రకు కూడా మద్దతు ఇవ్వలేకపోయిన ఆమె వైఖరిపై భగ్గుమంటున్నారు. జిల్లాలోని చీరాల, అద్దంకి, పర్చూరు, ఎస్‌ఎన్‌పాడు శాసనసభా నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. ఆయా నియోజకవర్గాల్లో  ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఆమె చేపట్టకపోవడాన్ని జనం దుయ్యబడుతున్నారు. గత ఎన్నికల్లో ఆమె నియోజకవర్గాల్లో పర్యటించకపోయినా.. ఇక్కడి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు.

 జౌళి శాఖా మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన రోజున, చీరాలలోని నేత కార్మికులు తమకు మంచి రోజులు వచ్చాయని భావించారు. అయితే చీరాల ప్రజలను పనబాక కన్నెత్తి కూడా చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీరాల సమీపంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2012 బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీనిపై పలుసార్లు ఇక్కడి చేనేత కార్మికులు పనబాకను కోరగా..రెండేళ్ల తరువాత శుక్రవారం (ఈనెల 14) శంకుస్థాపన చేసేందుకు అంగీకరించారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అది కూడా రాష్ట్ర విభజన హోరులో కొట్టుకుపోయింది.

 టెక్స్‌టైల్ పార్కును రూ. 70 కోట్లతో ఏర్పాటు చేయదలచుకుని, దానికి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించినా..పనబాక లక్ష్మి అలసత్వం వల్ల కార్యరూపం దాల్చలేకపోయింది. కనీసం భూసేకరణ కూడా చేయలేదు. టెక్స్‌టైల్ పార్కు వల్ల కొత్తగా ఉపాధి లభించకపోయినా..జౌళి రంగంలో కొత్త మెళుకువలు నేర్చుకునే అవకాశం లభించి ఉండేదని అంటున్నారు. గతంలో జౌళి పరిశ్రమకు పుట్టినిల్లుగా ఉన్న చీరాలలోని ఈ వృత్తివారు ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నారు. చీరాలలో ప్రస్తుతం వంద మంది కూడా జౌళి ఉత్పత్తిదారులు లేకపోవడానికి ప్రభుత్వ చిన్నచూపే కారణమని నిపుణులంటున్నారు.

 విభజనకు అనుకూలతపై భగ్గుమంటున్న జనం...
 ఇదిలా ఉండగా సీమాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే. సీమాంధ్రలో పాఠశాల విద్యార్థులు కూడా సమైక్యాంధ్ర కోసం రోడ్డు మీదకు వస్తుంటే, జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి విభజనకు అనుకూలత తెలియజేయడంపై తీవ్రంగా నిరసిస్తున్నారు. దీంతో ఆమె నియోజకవర్గంలోకి వస్తే నిలదీయడానికి  సిద్ధంగా ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక  సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ఎలాగూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాదని భావిస్తున్న పనబాక, ఉన్నంత వరకు అధికారాన్ని అనుభవించాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.

 ఆమె స్వంత ప్రయోజనం చూసుకోవడం తప్ప, జిల్లాకు ఒరిగిందేమీలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అవసరమైతే సోనియా గాంధీ ఆశీస్సులతో రాజ్యసభలో సభ్యత్వం సంపాదించడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. పనబాక నియోజకవర్గంలోకి అడుగు పెడితే  కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఆమెను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

మరిన్ని వార్తలు