నకిలీ జోరు!

18 May, 2014 02:19 IST|Sakshi

కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: నకిలీ విత్తనాల వ్యాపారం జిల్లాలో జోరందుకుంది. వాటిని అరికట్టి నియంత్రించాల్సిన వ్యవసాయాధికారులు కొందరు నిద్రావస్థలో జోగుతున్నారు. సీజన్ అంటూ లేకుండా ఎప్పుడు విత్తనం వేసినా ‘మా కంపెనీ  విత్తనాలు మంచి దిగుబడులిస్తాయంటూ’ నకిలీ విత్తన కంపెనీల ప్రతినిధులు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని రైతులకు విత్తనాలను అందజేస్తూ పంట పండించుకుంటున్నారు.
 
 ఈ విషయం తెలిసినా కొందరు వ్యవసాయాధికారులు తేలుకుట్టిన దొంగల్లా ఉంటున్నారని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. డివిజనల్, మండల వ్యవసాయాధికారులకు తెలియకుండా నకిలీ విత్తన వ్యాపారులు విత్తనాలను ధైర్యంగా గ్రామాల్లో విక్రయించలేరని వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని పోరుమామిళ్ల, బద్వేలు, మైదుకూరు డివిజన్లలోని కొన్ని గ్రామాలను కేంద్రంగా చేసుకుని నకిలీ విత్తన వ్యాపారులు వ్యాపారాలు సాగిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాల, గుంటూరు జిల్లా నుంచి  వైఎస్సార్ జిల్లాకు సరిహద్దుగా ఉన్న ప్రకాశం జిల్లా కొమరోలు నుంచి పోరుమామిళ్ల, బద్వేలు, దువ్వూరు, మైదుకూరు ప్రాంతాలకు విత్తనాలు భారీగా దిగుమతి అవుతున్నాయి.

అనేక కంపెనీ పేర్ల మీద నకిలీ విత్తనాలు వస్తుండటంతో ఏది నాణ్యమైనదో, ఏది నాణ్యత లేనిదో తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. జిల్లాలో దాదాపు 2.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు, రబీలో 1.75 హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  ప్రొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రధానంగా సాగు చేస్తారు. రైతుల వద్ద రాబోయే ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలు లేవనే విషయం తెలుసుకున్న నకిలీ వ్యాపారులు భారీగా విత్తనాలను సిద్ధం చేశారు. ప్రొద్దుతిరుగుడులో దాదాపు వంద కంపెనీల విత్తనాలు మార్కెట్‌లో ఉన్నాయి. దీంతో రైతులు తికమకపడుతున్నారు. నకిలీ విత్తనాలతో ప్రతి ఏటా వందలాది మంది రైతులు నష్టపోతున్నారు.
 
 గత ఏడాది ఖరీఫ్,రబీలో ప్రైవేటు కంపెనీల వారు పత్తి  విత్తనాలను రైతులకు ఇచ్చారు. వేలాది ఎకరాల్లో పంట ఏ మాత్రం రాక  నష్టపోయారు. నకిలీ వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి సాగు చేసిన ప్రొద్దుతిరుగుడు, పత్తి పంటతో పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ప్రభుత్వం, విత్తన కంపెనీల మధ్య ఎంవోయు ఉండటం వల్ల విత్తనం కారణంగా పంట దెబ్బతిన్నా తగిన పరిహారం అందేది. ఐదేళ్ల క్రితమే ఎంవోయు రద్దు కావడంతో మార్కెట్లోకి కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో విత్తనాలు వస్తున్నాయి. విత్తనాల మొలక శాతం ధ్రువీకరణపై ఇంత వరకు పరిశోధనల ప్రమేయం ఏ మాత్రం లేనందున నాణ్యతపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 పభుత్వ సంస్థ అయిన ఏపీ సీడ్స్ సరఫరా చేస్తున్న వేరుశనగ నాణ్యత పైనే గత ఏడాది అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమయ్యాయి. దీన్ని బట్టి చూస్తుంటే ప్రైవేటు కంపెనీల నాణ్యత ప్రశ్నార్ధకంగా మారింది. జిల్లాలో ఏ సీడ్ దుకాణంలో చూసినా 30 నుంచి 40 కొత్త రకాలు ఉంటున్నాయి. ఏపీ సీడ్స్ విత్తన సంస్థ నుంచి తెచ్చిన వరి విత్తనాలతో మండల కేంద్రమైన పెండ్లిమర్రి  గ్రామానికి చెందిన రైతులు పంట సాగుచేశారు. పంట ప్రారంభంలో ఏపుగా రావడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించారు. అయితే  పంట వెన్ను వచ్చిన తరువాత  కేళీలు అధికంగా రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
 
 అలాగే పోరుమామిళ్ల మండలంలో పొద్దుతిరుగుడు పంటలో కూడా పువ్వు మగ్గిన తర్వాత చూస్తే అన్ని తాలుగింజలు, ఒక్కొక్క పూవులో 15 విత్తనాల కంటే ఎక్కువ లేకపోవడంతో రైతులు అవాక్కయ్యారు. పంట మంచి దిగుబడి వస్తుందని ఈ యాజమాన్య పద్ధతులు పాటించాలని విత్తన డీలర్లు చెప్పడంతో ఆ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించి పంట వేశామన్నారు. కానీ పంట చేతికందే సమయంలో పూవులు ఒక్కో చెట్టుకు 10నుంచి 15 రావడం, తాలుగింజలు పడటంతో పెట్టుబడి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను మభ్య పెట్టి విత్తనాలను అంటగడుతున్న డీలర్లు పంటలు దెబ్బతిన్న సమయంలో తమకు తెలియదంటూ చేతులెత్తేస్తున్నారు. అయితే వ్యవసాయాధికారులు తగు సూచనలు, సలహాలు ఇవ్వకుండా ఉచిత సలహాలు ఇస్తూ చేతులు దులుపుకుంటుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.  
 

మరిన్ని వార్తలు