అసలును మించిన కొసరు ఖర్చు

13 Jun, 2014 01:10 IST|Sakshi
అసలును మించిన కొసరు ఖర్చు

 సాక్షి, కాకినాడ :‘చేతికందిన ముద్ద నోటికందడానికి ఎంత సమయం కావాలి?’ అని అడిగితే ఎవరైనా ఏం చెపుతారు? ‘మహా అయితే కొన్ని క్షణాలు’ అంటారు. అయితే.. పుర, ప్రాదేశిక ఎన్నికల విజేతలను ఇదే ప్రశ్న వేస్తే.. ‘అబ్బో.. రెండు నెలల పైమాటే’ అని నిట్టూరుస్తారు. అవును..మరి పురపోరు జరిగి రెండున్నర నెలలు, ప్రాదేశిక సమరం జరిగి డెబ్భై రోజులైనా వారింకా పదవులను చేపట్టలేదు. ఆ ఎన్నికల్లో ఓడిన వారు ఆశాభంగాన్ని ఈసరికే జీర్ణించుకుని స్థిమితపడి ఉంటారు. అయితే 1,434 మంది విజేతలు మాత్రం ‘పదవులు చేపట్టేది ఇంకెప్పుడు?’ అని అస్థిమితంతో వేగిపోతున్నారు. ఇక ‘అధ్యక్షా!’ అనిపించుకోవాలని ఉబలాటపడుతున్నవారికి ఈ జాప్యం మరింత దుర్భరంగా ఉంది.
 
 తమ వారు శత్రుశిబిరంలో చేరకుండా కళ్లలో వత్తులు వేసుకుని కాపలా కాయలేక, అలాగని వారికి ‘మారు మనసు’ కలగకుండా.. వారు మనసు పడిన ముచ్చట్లన్నీ తీరుస్తూ పంటి బిగువునే శిబిరాలను నిర్వహిస్తున్నారు. పుర, ప్రాదేశిక ఎన్నికల తర్వాత జరిగిన సార్వత్రిక సమరం   విజేతలు ప్రమాణ స్వీకారం చేయకున్నా పెత్తనం చెలాయిస్తున్నారు. వారిలో అదృష్టం వరించిన వారు మంత్రులుగా అందలాలూ ఎక్కారు. అయినా నేటి వరకు పాలనా పగ్గాలు చేపట్టలేని మున్సిపల్, ప్రాదేశిక విజేతలు ఎన్నికల కమిషన్ ఆదేశాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టు పాలకవర్గాల ఏర్పాటులో జాప్యంతో.. ఎంపీపీ, చైర్మన్ పదవులను ఆశించే వారికి శిబిరాల నిర్వహణ వ్యయం.. ఎన్నికల ఖర్చును మించిపోతూ చుక్కలు చూపిస్తోంది.
 
 సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పని నిరీక్షణ
 కాకినాడ కార్పొరేషన్ మినహా, రాజమండ్రి కార్పొరేషన్‌లో 50 డివిజన్లు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 264 వార్డులకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఏప్రిల్ 7న మేయర్, చైర్మన్ల ఎన్నిక పూర్తి చేయాలి. ఆ తర్వాత సుప్రీం ఆదేశాలతో 1,063 ఎంపీటీసీ, 57 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 13న పూర్తి చేసి ఏప్రిల్ 20లోగా ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ ఎన్నిక పూర్తి చేయాలి.
 
 అయితే ఈ రెండు ఎన్నికల ఫలితాలప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందన్న సుప్రీం ఆదేశాల మేరకు వీటి ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. మే 12న మున్సిపల్, మే 13న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. అంటే ఫలితాల కోసం మున్సిపల్ బరిలో నిలిచిన వారు 44 రోజులు, ప్రాదేశికబరిలో నిలిచిన వారు 38 రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. అప్పటికీ వారి నిరీక్షణకు తెరపడలేదు. పదవులు చేపట్టేందుకు మున్సిపల్ విజేతలు 31 రోజులుగా, ప్రాదేశిక విజేతలు 30 రోజులుగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
 మునుపెన్నడూ ‘భారం’ ఇన్నాళ్లు లేదు..
 
 గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా శిబిరాలను వారానికి మించి నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు శిబిరాలు ప్రారంభించి నెలరోజులు దాటినా ఇంకా  పగ్గాలు చేపట్టేదెప్పుడో తెలియడం లేదు. ఎంపీపీ, చైర్మన్ పీఠాలను ఆశిస్తున్న వారు తమ వర్గపు ఎంపీటీసీలు, వార్డు సభ్యులను శిబిరాలకు తరలించి అన్ని సుఖసదుపాయాలనూ కల్పించి, వారి గొంతెమ్మ కోరికలనూ తీర్చాల్సి వస్తోంది. ఎంపీపీ, చైర్మన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఓటేస్తే అనర్హత వేటు పడే అవకాశాలున్నా ప్రత్యర్థుల ప్రలోభాలకు, ధన ప్రభావానికి లోనై ఎక్కడ అటు జారిపోతారోనన్న శంకతో ఆశావహులు శిబిరాలను నిర్వహిస్తున్నారు. తిప్పలు పడ్డా, అప్పుల పాలైనా తమ వర్గీయులను పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు తిప్పక తప్పడం లేదు. మెట్టలోని టీడీపీకి చెందిన ఎంపీపీ అభ్యర్థి శిబిరాల నిర్వహణకు ఉన్న కొద్దిపాటి పొలాన్నీ కుదువపెట్టాల్సి వచ్చింది. ఆయనే కాదు.. శిబిరాలు నిర్వహిస్తున్న వారిలో ఎక్కువమందిది ఇదే పరిస్థితి.
 
 మరింత నిరీక్షణ అనివార్యం..
 ప్రమాణ స్వీకారం చేస్తే కానీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదు. ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లో తొలి రెండు రోజులూ ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. తర్వాత నాలుగైదురోజుల్లో ఎన్నికల కమిషన్ ప్రభుత్వ అనుమతితో ఎంపీపీ, చైర్మన్, మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. అయితే ప్రస్తుతమున్న ఎన్నికల కమిషన్ ఏ రాష్ర్ట ప్రభుత్వానికి చెందుతుందన్నది ఇంకా తేలలేదు. అది తేలితే కానీ స్థానిక సంస్థల పాలకవర్గాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కాదు. ఎంత తక్కువ లెక్కేసుకున్నా జూన్ చివరి వారంలో కానీ, జూలై మొదటి వారంలో కానీ మున్సిపల్, ప్రాదేశిక విజేతలు పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటివరకూ శిబిరాల నిర్వహణ అంటే.. తమకు వేసవిలో మొదలైన కాక తొలకరి అనంతరమూ తప్పనట్టేనని ఎంపీపీ, చైర్మన్ ఆశావహులు నిట్టూరుస్తున్నారు.
 

మరిన్ని వార్తలు