వదలని ఏనుగులు

21 Jan, 2019 07:18 IST|Sakshi
కుమ్మరిగుంట రోడ్డు దాటుతున్న ఏనుగులు

 పంటలు నాశనం

ఆందోళనలో ప్రజలు

విజయనగరం, కొమరాడ : సుమారు ఐదు నెలలుగా మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తూ భయానక వాతావరణం నెలకొల్పుతున్నాయి. గ్రామాల మీదుగా సంచరిస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల పకీరు అనే గిరిజనుడు ఏనుగుల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే గంగురేగువలసలో మరో వ్యక్తిపై కూడా దాడికి తెగబడ్డాయి. ఇదిలా ఉంటే ఏనుగులను తరలించే ప్రక్రియలో భాగంగా మందుగుండు కాల్చే ప్రక్రియలో ప్రమాదవశాత్తూ గంగురేగువలసలో సుమారు పదెకరాల చెరకు పంట కాలిపోయింది. అలాగే ఆదివారం జంఝావతి కుడికాలువ దాటుకుంటూ ఆర్తాం గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న మోటార్, పైపులను ఏనుగలు ధ్వంసం చేశాయి.

గున్న ఏనుగు మృతి తట్టుకోలేక..
గతంలో ప్రమాదవశాత్తూ ఎనిమిది ఎనుగలు గుంపులో ఓ గున్న ఏనుగు ఆర్తాం పరిసరాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి చనిపోయింది. దీంతో గున్నను మరిచిపోలేని ఏనుగుల గుంపు తిరిగి తిరిగి మళ్లీ మండలంలోకే వస్తున్నాయి. ఈక్రమంలో పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. కొమరాడ మండంలోని ప్రధాన పంట అయిన జొన్న, చెరకు, కూరగాయలు, తదితర పంటలు నాశనం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఏనుగులు తిరుగుతున్న ప్రదేశాల్లో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో అటు ఏనుగులతోను ఇటు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏనుగులను శాశ్వతంగా తరలించాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు