కూలి డబ్బులు 'సస్పెండ్‌'

1 Jun, 2018 11:27 IST|Sakshi
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

సస్పెన్షన్‌ ఖాతాల్లో ఉపాధి కూలీల నగTo దు

మూడేళ్లుగా అవస్థలు పడుతున్న ఉపాధి కూలీలు

జిల్లాలో సస్పెన్షన్‌ ఖాతాల్లో ఉన్నది రూ.2.51 కోట్లు

కూలీలకు రావాల్సిన డబ్బు గురించి పట్టించుకోని అధికారులు

గిద్దలూరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆశయం నీరుగారుతోంది. పథకం ప్రారంభంలో ఎందరో పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. గ్రామంలోనే పనులు కల్పించడం వలన ఉపాధి పనులు చేసుకుంటూ వారికి ఉన్న అరకొర భూములను సాగుచేసుకుంటూ ఆర్థికంగా కొంతమేర ఉపశమనం పొందారు.  ప్రస్తుతం ఉపాధిహామీ పథకం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. పథకం లక్ష్యం మంచిదే అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధి కూలీలుపనుల విషయంలో ఆసక్తి చూపడం లేదు. ఇవ్వాల్సిన కూలి డబ్బులను సకాలంలో అందజేయకపోవడమే ఇందుకు కారణమని కూలీలు ఆరోపిస్తున్నారు. మూడేళ్లుగా సస్పెన్షన్‌ ఖాతాల్లో ఉన్న సొమ్ము కూలీలకు అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. కూలీల వేతనం బ్యాంకు ఖాతాలో జమకావాలంటే కూలీల జాబ్‌కార్డు నంబరు, ఆధార్‌కార్డు నంబరు, బ్యాంకు ఖాతాకు అనుసంధానం కావాల్సి ఉంటుంది.  బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం కాకపోతే కూలీకి రావాల్సిన కూలి సొమ్మును సస్పెన్షన్‌ ఖాతాలో జమచేస్తారు. సస్పెన్షన్‌ ఖాతాల్లో ఉన్న నగదును సదరు కూలీకి చెల్లించడంలో ఉపాధి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మూడేళ్లుగా కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా సస్పెన్షన్‌ ఖాతాల్లో జమలు పేరుకుపోయాయి.

సస్పెన్షన్‌ ఖాతాల్లో రూ.2.51 కోట్లు:
గత మూడేళ్లుగా సస్పెన్షన్‌ ఖాతాల్లో రూ.2.51 కోట్ల ఉపాధి కూలీల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చేసిన పనికి సంబంధించిన కూలి డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 56 మండలాల్లో 40,300 మంది కూలీల ఖాతాలు సస్పెన్షన్‌లో ఉన్నాయి. ఇందుకు గాను రూ.2.51 కోట్ల నిధులు కూలీలకు అందకుండా ఉపాధి ఖాతాల్లోనే ఉండిపోయాయి. కష్టపడినందుకు గాను వచ్చే కూలి బ్యాంకులో పడకపోవడంతో కూలి డబ్బుల కోసం కూలీలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చూద్దాం.. చేద్దాం అంటూ కూలీలకు చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప వారికి కూలి డబ్బులు వచ్చేలా చేయడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం కూలీలకు శాపం...
అధికారుల నిర్లక్ష్యం ఉపాధి కూలీలకు శాపంగా మారింది. ఉపాధి కూలీలకు జాబ్‌కార్డు ఇచ్చిన తర్వాత వారి ఖాతాలకు ఆధార్‌ కార్డు నంబర్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. జాబ్‌కార్డు నంబర్‌తో పాటు బ్యాంకు ఖాతా నంబరుకు ఆధార్‌కార్డును అనుసంధానం ఖచ్చితంగా ఉంటేనే వారికి కూలి డబ్బులు ఖాతాలో జమవుతాయి. దగ్గరుండి కంప్యూటర్‌ ఆపరేటర్లతో ఈ ఖాతాలను అనుసంధానం చేయించే బాధ్యత అధికారులే తీసుకోవాలి. అయినప్పటికీ వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చిందని పలువురు కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ ఖాతాలను అనుసంధానం చేస్తేనే కూలీలు చేసిన పనులకు వేతనాలు జమయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకు అధికారులు, ఉపాధి అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఉపాధి కూలీలకు చెందిన కూలి డబ్బులు ఉన్న సస్పెన్షన్‌ ఖాతాల సమస్యను పరిష్కరించాలని కూలీలు కోరుతున్నారు.

ఈమె పేరు మట్టెమల్ల లుథియమ్మ, రాచర్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామం. ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించి ఈమెకు రావాల్సిన మొత్తం రూ.8,900. గత సంవత్సర కాలంగా తనకు రావాల్సిన కూలి సొమ్ము గురించి ఉపాధి సిబ్బందిని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ‘ఇల్లు గడవడం కోసం పనికి వెళితే చేసిన పనికి వేతనాలు చెల్లించకపోతే ఎలా. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ లింకు కాలేదని అందుకే డబ్బులు రాలేదని అధికారులు చెబుతున్నారని’ లుథియారాణి ఆవేదన చెందుతోంది.
ఈ యువకుని పేరు ఎం.రోశయ్య, రాచర్ల మండలంలోని యడవల్లి గ్రామం. గత ఏడాది చేసిన పనికి సంబంధించిన రూ.6 వేలు వరకు కూలి సొమ్ము రావాలి. 9 వారాల పాటు పనిచేస్తే ఒక్క రూపాయి బిల్లు ఇవ్వలేదు. ‘వేసవిలో పనులు చేసి సంపాదించుకున్న డబ్బుతో చదువుకునేందుకు ఉపయోగించుకోవచ్చని ప్రతి రోజూ పనికి వెళ్తున్నాను. అయినప్పటికీ కూలి సొమ్ము ఇవ్వడం లేదు.  బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ జతకాకుంటే చేయాల్సిన బాధ్యత ఉపాధి అధికారులదే కానీ ఇన్ని రోజులుగా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని’ రోశయ్య ప్రశ్నిస్తున్నాడు.

బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చేయించుకోవాలి
సస్పెండ్‌ ఖాతాల్లో కూలి సొమ్ము జమ అయిన వారు వారికి చెందిన జాబ్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఇస్తే వారు అనుసంధానం చేస్తారు. అనంతరం పేమెంట్‌లు జనరేట్‌ చేయడం ద్వారా ఆయా ఖాతాలకు నగదు జమవుతుంది. పాత బకాయిలు రావాల్సిన వారు సంబంధిత పోస్టల్‌ సిబ్బందిని కలిస్తే వారు నగదు ఇస్తారు. సస్పెండ్‌ ఖాతాల్లో ఉన్న నగదును కూలీలకు ఇచ్చేందుకు ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్సులను ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల ద్వారా సేకరించి ఎవరి కూలి సొమ్ము వారికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం.
– పద్మావతి, డ్వామా ఏపీడీ.

మరిన్ని వార్తలు