ప్రాజెక్టులకు పచ్చజెండా

16 Nov, 2013 04:22 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) బోర్డు సమావేశం శుక్రవారం ఇక్కడి ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర ఎనర్జీ శాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. వార్షిక ఆదాయ, వ్యయాలపై ఏటా నిర్వహించే ఆడిట్ కమిటీ సమావేశంలో భాగంగా బోర్డు భేటీ అయింది.

ఈపీడీసీఎల్ పరిధిలో అవసరమైన చోట విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీంతో 49 సబ్‌స్టేషన్లను ఈపీడీసీఎల్ కొత్తగా ఏర్పాటు చేసేందుకు బోర్డుకు ప్రతిపాదించింది. సెక్షన్ ఆఫీసు (సహాయ ఇంజినీరు)లో ఇద్దరేసి లైన్ ఇన్‌స్పెక్టర్లుండాలి. ఈపీడీసీఎల్ పరిధిలో సెకండ్ లైన్‌మన్ లేని సెక్షన్ కార్యాలయాలు 84 ఉన్నాయి. వీటికి సెకండ్ లైన్‌మన్ పోస్టుల కేటాయింపు కోసం కొన్నాళ్లుగా ప్రతిపాదనలున్నాయి. వాటిపై ఎట్టకేలకు బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పోస్టుల భర్తీకి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఈపీడీసీఎల్ అధికారులు ట్రాన్స్‌కోకు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపేందుకు తీర్మానించారు. ఈ సమావేశంలో ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు,  డెరైక్టర్లు కృష్ణ, హరిప్రసాద్, లక్ష్మీనారాయణ  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు