ఎర్రచందనం స్మగ్లర్లతో దోస్తీ వద్దు

25 Sep, 2014 02:31 IST|Sakshi
ఎర్రచందనం స్మగ్లర్లతో దోస్తీ వద్దు

కడప అర్బన్ : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న, పేరుమోసిన స్మగ్లర్లతో దోస్తీ పనికిరాదని కడప, కర్నూల్ రేంజ్ డీఐజీ మురళీకృష్ణ హెచ్చరించారు. అలా స్నేహం చేస్తే తమ ఉద్యోగాలకే ముప్పు వాటిల్లుతుందని, ఇందుకు రాజంపేట డీఎస్‌పీ సంఘటనే ఉదాహరణ అని అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ ఛాంబరులో అధికారులతో  సమావేశమయ్యారు. ఈసందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. భవిష్యత్తులో కూడా అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో కృషి చేస్తామన్నారు. తాత్కాలిక ప్రయోజనాలకు, వ్యసనాలకు లోబడి స్మగ్లర్లతో దోస్తీ చేయడం సరికాదన్నారు. అలా చేస్తే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అలాగే జిల్లాలో వివిధ స్టేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులను నమోదు చేసినా సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ, అడ్మిన్ ఏఎస్పీ విజయ్‌కుమార్, మైదుకూరు డిఎస్పీ శ్రీదర్‌రావు, ప్రొద్దుటూరు డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి, పులివెందుల డిఎస్పీ హరినాథ్‌బాబు, సీఐలు శ్రీనివాసులు, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.


 

>
మరిన్ని వార్తలు