దోపిడీ దొంగల బీభత్సం

22 Aug, 2015 01:32 IST|Sakshi

 పట్నంబజారు : చుట్టుగుంట సమీపంలోని కోదండరామ్‌నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం దోపిడీదొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని కట్టిపడేసి, బీరువాలోని 80 సవర్ల బంగారం, నగదు దోచుకుపోయిన సంఘటన సంచలనం రేకెత్తించింది. నగరంపాలెం పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కోదండరామ్‌నగర్ 4వలైనుకు చెందిన షేక్ బాషా ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా  ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
 అయితే కుమారుడి  ఉద్యోగ పరీక్షల నిమిత్తం కృష్ణాజిల్లాలోని కంచికచర్లకు ఈ నెల 20వ తేదీన వెళ్లారు. ఇంట్లో కుమార్తె నిగర్‌సుల్తానా(నీలు) మాత్రమే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఒక యువతి బుర్ఖా వేసుకుని వచ్చి నీలూ అంటూ మద్దు పేరుతో పిలిచింది. బుర్ఖాలో ఉన్న యువతి స్నేహితురాలు అయి ఉంటుందని భావించిన నీలు తలుపులు తీయగానే, వచ్చిన యువతి హడావుడిగా ఇప్పుడే వస్తా.. ఉండమంటూ కిందకు వెళ్లిపోయింది. కొద్దిసేపు వేచిచూసిన నీలు తిరిగి ఇంట్లోకి వెళ్లిపోతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక యువతి, ఇద్దరు యువకులు ఆమెను కిందపడేసి కొట్టారు.
 
 ప్లాస్టర్‌లతో నీలుని కట్టిపడేసి, గొంతు కు చున్నీని బిగించి బీరువా తాళాలు ఎక్కడ ఉన్నాయో... చెప్పాలని బెదిరించారు. ఇవ్వకపోతే చంపుతామని, నీలుని అక్కడ నుండి తీసుకుని వెళ్లి బాత్రూమ్ వద్ద పడేశారు. గుడ్డతో గొంతు నులిమి పిడిగుద్దులు కురిపించడంతో నీలు భయకంపితురాలై వారికి బీరువా తాళాలు ఇచ్చేసింది. నీలును స్పృహ కోల్పోయేలా గాయపరిచిన దుండగులు బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు దోచుకుపోయారు. కొద్దిసేపటికి పక్కింట్లో ఉన్న వారు నీలుని గమనించి కట్లు విప్పదీసి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. నిందితులు చోరీల్లో ఆరితేరిన వారిలా బీరువా, ఇతర వారు పట్టుకున్న వస్తువులపై కారం చల్లారు.  ముగ్గురూ హిందీభాషలో మాట్లాడుతున్నారని బాధితురాలు తెలిపింది.
 
 తెలిసిన వారి పనేనా...?
 బాషా కుటుంబ సభ్యులు ఇంట్లోలేరని, కేవలం కుమార్తె నీలు మాత్రమే ఉందని తెలిసిన వారు మాత్రమే ఇందుకు పాల్పడి ఉంటారని పోలీసు లు భావిస్తున్నారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. నివాసం ఎదురుగా ఉన్న సీసీ ఫుటేజీలో వచ్చిన దుండగుల వివరాలను పోలీసులు కనుగొన్నట్లు తెలిసింది. సంఘటన స్ధలాన్ని ఏఎస్పీ వెంకటప్పలనాయుడు, సీసీఎస్ అడిషనల్ ఎస్పీ బీపీ తిరుపాల్, డీఎస్పీ పి. శ్రీని వాసరావు, సీఐలు ధర్మేంద్రబాబు,ఇ.వేమారెడ్డి తదితరులు పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు