ముసుగుదొంగల బీభత్సం

19 Aug, 2015 02:28 IST|Sakshi
ముసుగుదొంగల బీభత్సం

- రూ.70 వేల దోపిడీ  

 రాపూరు : మండలంలోని పెంచలకోనలో ఉన్న హరేరామ హరేకృష్ణ ఆశ్రమంలోకి మంగళవారం తెల్లవారు జామున ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. ఆశ్రమంలోకి ప్రవేశించి నిర్వాహకులను కట్టేసి, కొట్టి బీరువాలోని రూ.70 వేల నగదును దోచుకెళ్లారు. ఎస్‌ఐ కరిముల్లా కథనం మేరకు.. హరేరామ హరేకృష్ణ ఆశ్రమాన్ని హనుమంతరెడ్డి 40 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. క్షేత్రంలో ఆయన, వంట మనిషి విజయమ్మ నిద్రిస్తుండగా తెల్లవారు జామున ఆరుగురు వ్యక్తులు ముసుగులు ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించారు. వంట మనిషి విజయమ్మ వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకోని, అక్కడే నిద్రిస్తున్న హనుమంతరెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. అతని వద్ద నుంచి  వంట మనిషి ద్వారా బీరువా తాళాలు తీసుకుని ఆమెతోనే బీరువా తీయించి అందులో ఉన్న రూ.70 వేల నగదు దోచుకుని కారులో పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ  
 పెంచలకోనలోని హరేరామహరే కృష్ణ ఆశ్రమంలో జరిగిన సంఘటనను తెలుసుకున్న గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిర్వాహుకులు హనుమంతరెడ్డి, విజయమ్మను, స్థానికులను విచారించారు. సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. సంఘటన స్థలంలో డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేపట్టారు. జాగిలం ఆశ్రమం పరిసరాలను తిరుగాడింది. ఎలాంటి ఆధారాలు లభించలేదు.

మరిన్ని వార్తలు