ఫెయిల్ మోడల్

13 Aug, 2015 01:51 IST|Sakshi
ఫెయిల్ మోడల్

పురిటి కష్టాల్లోనే మోడల్ స్కూళ్లు
17 స్కూళ్లలో మూడు చోట్లే హాస్టళ్ల నిర్మాణం
కంప్యూటర్లు, ల్యాబ్,  లైబ్రరీ.. అన్నీ నిరుపయోగం

 
జిల్లాలో మోడల్ విద్య మిథ్యగానే మారుతోంది. గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యనందించాలనే లక్ష్యంతో 2013లో ప్రారంభించిన ఈ పాఠశాలలు ఇంకా పురిటినొప్పులతోనే బాధపడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత వీటి బాగోగులు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.జిల్లాలోని మోడల్ స్కూళ్ల కు పురిటి కష్టాలు వీడనంటున్నాయి. ఏళ్లు గడుస్తున్నా వీటి బాగోగుల గురిం చి పట్టించుకునేవారు కరువయ్యారు.

 హాస్టల్ భవనం ఉంటే ఒట్టు
 జిల్లాలోని కేవీబీపురం, ఎర్రావారిపాళెం, కలకడ, కేవీపల్లె, కురబలకోట, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, పీటీఎం, మొలకలచెరువు, బి.కొత్తకోట, పుంగనూరు, రామసముద్రం, బెరైడ్డిపల్లె, శాంతిపురం, కు ప్పం, గుడిపల్లె, రామకుప్పం మండలాల్లో మోడల్ స్కూళ్లు నడుస్తున్నాయి. మోడల్ స్కూళ్లలో ఒక్కో హాస్టల్‌కు రూ.65 లక్షలతో 2012లోనే టెండర్లు పిలిచారు. పెద్దమండ్యం, బి.కొత్తకోట, పీటీఎంలో మాత్రం నిర్మాణాలు పూర్తయినా వాడుకలోకి రాలేదు. మిగిలిన చోట్ల కేవలం పునాదుల నుంచి, పిల్లర్ల దశలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన అంచనావ్యయానికి పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలకు పొంతనలేకపోవడంతో కాంట్రాక్టర్లు ని ర్మాణాలు తమవల్ల కావంటూ చేతులెత్తేశారు.  రివైజ్డ్ ఎస్టిమేషన్లతో మళ్లీ టెం డర్లు పిలిస్తేగానీ వీటి పనులు జరిగేటట్టు లేదు. ఇక పాఠశాల భవనాలకు ఒక్కోదానికి రూ.3.5 కోట్లు మంజూరు చేయ గా అన్ని పాఠశాలల్లోనూ మొదటి అంతస్తులో నాలుగేసి గదులు నిధుల లేమితో ఆగిపోయాయి. ఈ పనులను పర్యవేక్షించిన ఆరీవీఎం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమే.

పట్టించుకోని ప్రభుత్వం...
 మోడల్ స్కూళ్ల ఏర్పాటుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి సంవత్సరం 75:25 రేషియోతో భరించాలి. ఇక రెండో సంవత్సరం 50:50, మూడో ఏడాది 25:75 నాలుగో సంవత్సరం పూర్తిగా రాష్ర్టమే భరించాలి. అయితే నిధుల లేమితో ప్రస్తుత సర్కారు వీటి గురించి పట్టించుకోవడంలేదు.

 అంతా ఖాళీల మయం
 ఒక్కో పాఠశాలో మొత్తం 480 మంది విద్యార్థులు చేరాల్సిండగా ప్రతి చోటా సగటున 50 నుంచి వంద దాకా ఖాళీలే ఉన్నాయి. ఈ దఫా మెరిట్ ప్రాతిపదికన సీట్లను కేటాయించినా అసౌకర్యాల కారణంగానే చాలా ఖాళీలు ఏర్పడ్డాయి.  నాలుగు చోట్ల మినహా మిగిలిన చోట్ల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాళ్లే దిక్కు.

 ఎన్ని అగచాట్లో
 హాస్టల్ సౌకర్యం లేక పిల్లలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. నిత్యం నాలుగైదు బస్సులు మారి పాఠశాలలకు వచ్చే విద్యార్థులే ఎక్కువ. నాలగైదు బస్సులు మారి కొందరు రాత్రిపూట పది గంటలకు ఇంటికెళ్తున్నారు.
 
సమస్యలివీ

పిల్లలకు యూనిఫాం ఇవ్వలేదు.కంప్యూటర్లు, సైన్స్‌ల్యాబ్‌లున్నా ఫ్యాకల్టీలేక అవి నిరుపయోగమే.మధ్యాహ్న భోజనానికి నిధులందక నిర్వాహకులు అప్పులు చేసి వండుతున్నారు. వంట గదులూ లేవు.ఇంటర్ విద్యార్థులకు ఇంతవరకు అచ్చుపుస్తకాలు అందలేదు.అన్ని చోట్లా రిమోట్ ప్రాంతాల్లోనే ఉన్నప్పటికీ పాఠశాలలకు ప్రహరీ     గోడలు లేవు.
 
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
 మోడల్ స్కూల్ అంటే ఎన్నో ఆశలతో అందరూ చాలా ఊహించాం. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. హాస్టల్ భవణాల నిర్మాణం కొండెక్కింది. పిల్లలు కష్టాలు చూస్తే మాకూ బాధగానే ఉంది. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.   - వాసుదేవనాయుడు,
 డీవైఈవో, చిత్తూరు

కడుపు తరుక్కుపోతోంది
ప్రభుత్వం మోడల్ స్కూళ్ల పట్ల ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లా. ఎవరూ పట్టించుకోలేదు. ఇదే మోడల్ స్కూళ్లు పొరుగు రాష్ట్రాల్లో అద్భుతంగా ఉన్నాయి.
 - టి.వెంకట్రమణ,
 ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్, మోడల్‌స్కూల్, కమ్మనపల్లె
 

>
మరిన్ని వార్తలు