సూపర్‌ సైక్లోనే..!

29 Apr, 2019 03:45 IST|Sakshi
తుపాను తీవ్రతను తెలియజేస్తున్న ఉపగ్రహ చిత్రం

మరింత తీవ్రరూపం దాలుస్తున్న ‘ఫొని’

గంటకు 195 కి.మీ. వేగంతో పెనుగాలులు

మే 1 నుంచి దిశ మార్చుకోనున్న తుపాను

దీంతో వానలకు బదులు వేడిగాలులు

మూడు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు 

మచిలీపట్నానికి 1090 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతం  

సాక్షి, విశాఖపట్నం: ఫొని తుపాను అంతకంతకు తీవ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు ఉధృతమవుతోంది. ఊహించిన విధంగానే సూపర్‌ సైక్లోన్‌గా మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను వాయవ్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం రాత్రికి చెన్నైకి ఆగ్నేయంగా 910, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగాను, అనంతరం 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను మారనుంది. ఇలా మే ఒకటో తేదీ సాయంత్రం వరకు క్రమంగా వాయవ్య దిశగా పయనించనుంది. ఆ తర్వాత మలుపు (రీకర్వ్‌) తీసుకుని ఉత్తర ఈశాన్య దిశలో కదులుతుంది.

మే ఒకటో తేదీన సూపర్‌ సైక్లోన్‌ (ఎక్‌స్ట్రీమ్‌లీ సివియర్‌ సైక్లోనిక్‌ స్టార్మ్‌)గా బలపడనుందని భారత వాతావరణ విభాగం ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. తీవ్ర తుపానుగా ఉన్న సమయంలో బంగాళాఖాతంలో గంటకు 110–125, అతి తీవ్ర తుపానుగా మారాక 130–155, సూపర్‌ సైక్లోన్‌ అయ్యాక 160–195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. అదే సమయంలో కోస్తాంధ్ర, పుదుచ్చేరి, తమిళనాడు తీర ప్రాంతాల్లో గంటకు 50–70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడతాయి. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ‘ఫొని’ తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని విశాఖపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 2వ నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 5వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

30 నుంచి ‘ఫొని’ ప్రభావం!
తుపాను ప్రభావం ఈనెల 30 నుంచి రాష్ట్రంపై కనిపించనుంది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మే 2వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.  

విశాఖ ఏజెన్సీలో వర్షాలు
విశాఖ ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి. హుకుంపేట, డుంబ్రిగుడ, అరుకులోయ మండలాల్లో వర్షం పడింది. మిగిలిన ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మధ్యాహ్నం మాత్రం తీవ్రమైన ఎండతో జనం అవస్థలు పడ్డారు. కాగా శనివారం వీచిన గాలులతో విద్యుత్‌ వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నర్సీపట్నం ప్రాంతంలో ఆదివారం కూడా సరఫరాను అధికారులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేకపోయారు.  

వానలకు బదులు ఎండలు..
వాస్తవానికి తుపానులు వచ్చినప్పుడు భారీ వర్షాలు కురుస్తాయి. కానీ ఈ తుపానుకు మాత్రం వానలకంటే ఎండలే ఎక్కువగా ప్రభావం చూపించనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తుపాను వాయవ్య దిశగా పయనించడం వల్ల అటు నుంచి వీస్తున్న వేడిగాలులను తుపాను శక్తి రాష్ట్రంపైకి లాక్కుని వస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న మూడు, నాలుగు రోజులు సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. 

మరిన్ని వార్తలు