‘రుణం’ తీర్చలేక..

16 Oct, 2013 06:31 IST|Sakshi

గుడిహత్నూర్/ఇచ్చోడ/తలమడుగు, న్యూస్‌లైన్ : జిల్లాలో ముగ్గురు యువరైతులు అప్పులు తీర్చలేక మనస్తాపంతో మృతి చెందారు. ఇద్దరు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో మరణించారు.. గుడిహత్నూర్ మండలం తోషంతండాకు చెందిన పవార్ కిశోర్(29) తనకున్న ఐదెకరాలతోపాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, సోయా, టమాటా సాగు చేశాడు. సాగు కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నీట మునిగింది. చీడపీడలు సోకడంతో అప్పులు చేసి రసాయనిక ఎరువులు చల్లాడు. అయినా ఆశించిన దిగుబడి రాలేదు. దీనికితోడు చెల్లిలు పెళ్లి చేశాడు. సాగు, పెళ్లి కోసం చేసిన అప్పులు పేరుకుపోవడం, దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెందాడు. మూడు రోజుల నుంచి భోజనం కూడా చేయడం లేదు. ఆదివారం రాత్రి తన తండ్రి మోహన్ వద్దకు వెళ్లి తనకు రూ.3 లక్షలఅప్పు అయిందని పంటను చూస్తుంటే అప్పు తీరే మార్గం లేదని విచారం వ్యక్తం చేసి తన గదిలో పడుకోవడానికి వెళ్లాడు. సోమవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో తన తండ్రి నిద్రలేపగా మంచంపై గుండెపోటుతో మృతిచెంది ఉన్నాడు. కిశోర్‌కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
 
 అప్పులబాధతో యువరైతు..
 ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన యువరైతు కిల్లారే సుదర్శన్(28) తనకున్న ఐదెకరాల భూమిలో సోయా, పత్తి సాగు చేశాడు. జూలైలో కురిసిన వర్షాలకు కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. కలుపు తీయడానికి, రసాయనిక ఎరువుల కోసం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుంచి రూ.1.75 లక్షలు రుణం తీసుకున్నాడు. అయినా దిగుబడి రాలేదు. అప్పులు ఎలా తీర్చేమార్గం కనిపించ లేదు. దీంతో సోమవారం ఉదయం చేనులోనే పురుగుల మందుతాగాడు. గమనించిన స్థానికులు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. సుదర్శన్ భార్య కవిత ఫిర్యాదు మేరకు ఎస్సై రమేశ్ కూమార్ కేసు చేస్తున్నారు. సుదర్శన్‌కు ఆరేళ్ల కూతురు శ్రుతి, మూడేళ్ల కుమారుడు కిరణ్ ఉన్నారు.
 
 కౌలు రైతు..
 తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన రైతు జాదవ్ ప్రకాశ్(25) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశ్ ఎనిమిదెకరాల భూమిని రూ.80వేలు ప్రైవేటుగా అప్పుచేసి కౌలుకు తీసుకున్నాడు. పత్తి, జొన్న సాగు చేశాడు. అతివృష్టితో పంటలు నీటమునిగా యి. దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెందాడు. మంగళవారం చేనులోనే పురుగుల మందుతాగాడు. సోదరుడు సుభాష్ గమనించి చికిత్స ని మిత్తం రిమ్స్‌కు తరలించాడు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెం దాడు. ప్రకాశ్‌కు ఆరు నెలల క్రితమే పెళ్లి అయింది. భార్య సోనుబాయి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు