నిజమైన సమైక్యవాదం వైసీపీదే | Sakshi
Sakshi News home page

నిజమైన సమైక్యవాదం వైసీపీదే

Published Wed, Oct 16 2013 6:29 AM

True collectivism YSR CP

తణుకు, న్యూస్‌లై న్ : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, టీడీపీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంటే సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం నూరుశాతం నిజాయితీతో పనిచేస్తూ సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమేనని ఆ పార్టీ నేత రఘురామకృష్ణంరాజు అన్నారు. మంగళవారం తణుకు-పైడిపర్రులోని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య కార్యాలయంలో రఘు విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే సాగు, తాగునీరు, విద్యుత్, విద్య, ఉద్యోగావకాశాలు వంటి సమస్యలతో వ్యవస్థ సర్వనాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
 ఈ అంశాలన్నీంటిని పరిగణనలోకి తీసుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రెండుసార్లు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని చెప్పారు. రాష్ట్రవిభజన తగదని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ప్రముఖ న్యాయవాదిచే సుప్రింకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు వివరించారు. తెలంగాణాలోనూ సమైక్యవాదులున్నారని, వారందరి సహకారంతో హైదరాబాద్‌లో వైసీపీ తలపెట్టిన సమైక్య శంఖారావం సభను విజయవంతం చేస్తామని తెలిపారు.
 
 సమైక్యాంధ్ర సాధన కోసం చిరుద్యోగులు జీతాలు సైతం వదిలి 75 రోజులుగా పోరాడుతున్నారని, వారికి చిరుసాయం అందించి ఆదుకోవాలనే తపనతో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టినట్టు రఘురామకృష్ణంరాజు వివరించారు. చీర్ల రాధయ్య మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు పార్టీలో చేరడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందన్నారు. విడివాడ రామచంద్రరావు, పార్టీ మండల కన్వీనర్లు  వెలగల అమ్మిరెడ్డి, ఆలపాటి నాగేశ్వరరావు, వీరవల్లి పాలేశ్వరావు పాల్గొన్నారు. పాలకొల్లులో క్షత్రియ సంక్షేమ పరిషత్ కార్యదర్శి చెరుకూరి రామలింగరాజు రఘురామకృష్ణంరాజు సమక్షంలో వైసీపీలో చేరారు.
 

Advertisement
Advertisement