పాస్ట్ అండ్ ఫ్యూరియస్!

12 Apr, 2015 04:45 IST|Sakshi
పాస్ట్ అండ్ ఫ్యూరియస్!

ఇటీవలే విడుదలైన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లోని 7 వ చిత్రం ప్రపంచ ప్రేక్షకుల్ని ఊపిరాడనివ్వడం లేదు. అదే స్థాయిలో ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ దేశాలను ఉర్రూతలూగిస్తున్న చిత్రం ‘బ్యాటిల్ ఫర్ సెవస్టోపుల్’. మునుపటి సోవియట్ యూనియన్‌లో భాగమైన రష్యా, ఉక్రెయిన్‌ల సంబంధాలు బాగా క్షీణించి ఉన్న ప్రస్తుత తరుణంలో ‘బ్యాటిల్ ఫర్ సెవస్టోపుల్’ను ఇరు దేశాల ప్రజలూ ఒకేలా ఆదరిస్తున్నారు! అయితే ఉక్రెయిన్ సరిహద్దు సినిమా హాళ్లలో మాత్రం ఈ చిత్రాన్ని ‘ఇన్‌డిస్ట్రక్టబుల్’ అనే పేరుతో ప్రదర్శిస్తున్నారు!

రెండు దేశాల సంబంధాలు దెబ్బతినకముందు  ఇరు దేశాల నిర్మాణ సంస్థలు కలిసి బ్యాటిల్ ఫర్ సెవస్టోపుల్ ను నిర్మించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ‘లేడీ డెత్’గా ఖ్యాతిగాంచిన రెడ్ ఆర్మీ సైనికురాలు ల్యుడ్మిలా పావ్‌లిఛెంకో జీవితకథ ఆధారంగా డెరైక్టర్ సెర్గీ మోక్రిత్‌స్కీ ఈ సినిమా తీశారు. 1941లో ఫ్రంట్‌లైన్ సైనికురాలిగా యుద్ధంలోకి దిగిన పావ్‌లిఛెంకో... సెవస్టోపుల్ నగరం నాజీల హస్తగతం కాకుండా భీకరంగా  పోరాడుతున్న క్రమంలో ఏడాదిలోపే  309 మంది నాజీ సైనికులను తన రైఫిల్‌తో హతమార్చారు!

అంతటి చరిత్రాత్మకమైన సెవస్టోపుల్ ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పంలో ఉంది. ఆ క్రిమియా ఇప్పుడు  రష్యా అధీనంలో ఉంది. బహుశా అందుకే కావచ్చు.. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఘర్షణకు ప్రధాన కారణమైన క్రిమియాలోని సెవస్టోపుల్‌పై వచ్చిన ‘బ్యాటిల్ ఫర్ సెవస్టోపుల్’.. రెండు దేశాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

>
మరిన్ని వార్తలు