‘ట్రామ్’ కార్లకు ప్రాణం పోసిన ‘డిటెక్టివ్’ | Sakshi
Sakshi News home page

‘ట్రామ్’ కార్లకు ప్రాణం పోసిన ‘డిటెక్టివ్’

Published Sun, Apr 12 2015 4:39 AM

‘ట్రామ్’ కార్లకు ప్రాణం పోసిన ‘డిటెక్టివ్’ - Sakshi

 సినిమా అంటే ఊహాలోకంలో విహరింపజేయడమేగా అని అందరూ అంటారు. కానీ, ఒక నిర్ణీత కాలానికి చెందిన సినిమా తీస్తున్నప్పుడు ఆ కాలపు వాతావరణాన్ని ప్రతిఫలించాలంటే, అప్పటి వాస్తవలోకాన్ని పునఃసృష్టించాల్సిందే! ఇటీవల విడుదలై అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న హిందీ చిత్రం ‘డిటెక్టివ్ బ్యోమకేశ్ బక్షీ’లో సరిగ్గా ఆ పనే చేశారు. 1942 నాటి కలకత్తాను తెరపై చూపడం కోసం అప్పటి ట్రామ్ కార్లకు మళ్ళీ ప్రాణం పోశారు.

1930లలో తయారైన రెండు కొయ్య ట్రామ్ కార్లు, 1915 కాలానికే తయారై అప్పట్లో కలకత్తా నగర ట్రామ్ ట్రాక్‌లపై నీళ్ళు చల్లడానికి ఉపయోగించిన ఒక కారు - ఈ సినిమా కోసం సరికొత్తగా ముస్తాబయ్యాయి. అప్పట్లోని ‘ద కలకత్తా ట్రామ్‌వేస్ కంపెనీ’ నడిపిన ప్రసిద్ధమైన ‘నంబర్ 563’, ‘నంబర్ 567’ ట్రామ్‌లకు ఈ అదృష్టం దక్కింది. పాత ఫోటోలు చూసి, ఆ ట్రామ్‌ల పైకప్పు మీద బెంగాల్ ల్యాంప్, లక్స్ సబ్బులాంటి ఆ కాలపు వాణిజ్య ప్రకటనల్ని ఇంగ్లీషు, బెంగాలీ, హిందీ భాషల్లో చిత్రించారు.

బెంగాలీ సాహిత్యంలో పాపులరైన డిటెక్టివ్ బ్యోమకేశ్ బక్షీ పాత్రను తెరపైకి తీసుకురావడం వల్ల ఒకటికి రెండు ప్రయోజనాలు కలిగినట్లున్నాయి. కనుమరుగైపోతున్న పాత కాలపు ట్రామ్ కార్లు రెండు ఇప్పుడు ఈ సినిమా నిర్మాతల ఖర్చుతో కొత్తగా తయారయ్యాయి. జనానికి వాటిని మరోసారి పరిచయం చేసినట్లూ అయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement