ఆవేశం.. అనుమానం

23 Jan, 2014 00:44 IST|Sakshi
ఆవేశం.. అనుమానం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎత్తుకొని ముద్దు చేయాల్సిన కన్నతండ్రే కాలయముడయ్యాడు. గుక్కపెట్టి ఏడుస్తున్న పసివాడిని ఊరడించాల్సింది పోయి ఉసురు తీశాడు. అస్తమానం ఏడుస్తున్నాడన్న కోపంతో అమాంతం ఎత్తుకెళ్లి నీళ్ల ట్యాంకులో పడేశాడు. ఊపిరాడక ఆ మూడేళ్ల బాలుడు ప్రాణాలు వదిలాడు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. శ్రీశైలం, స్వప్న దంపతులు తారామతిపేటలో నివాసం ఉంటున్నారు. శ్రీశైలం గొర్రెల కాపరి. వీరికి మూడేళ్ల కుమారుడు బాల మల్లేష్ ఉన్నాడు. బాల మల్లేష్ పుట్టుకతోనే కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. నొప్పికి తరచూ ఏడుస్తుండేవాడు. బుధవారం తెల్లవారుజామున ఏడుస్తుండగా తల్లి ఊరడిస్తూ పాలుపట్టింది. అయినా ఏడుపు ఆపలేదు. దీంతో శ్రీశైలం కింది గదిలో ఉన్న తన తల్లి దగ్గరికి తీసుకెళ్తానని కొడుకును ఎత్తుకొని వెళ్లాడు. గుక్కపట్టి అలాగే ఏడుస్తుండడంతో శ్రీశైలం రెండో అంతస్తుపై ఉన్న నీటి ట్యాంక్‌లో పడేశాడు. అనంతరం ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాడు. వారు వెళ్లి ట్యాంకు నుంచి బాలుడిని బయటకు తీయగా అప్పటికే మరణించాడు.
 
 అనుమానంతో రెండేళ్ల కొడుకుని కడతేర్చిన కసాయి
 కోడుమూరు, న్యూస్‌లైన్: అనుమానంతో కన్న కొడుకును తండ్రే కడతేర్చిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఆటోడ్రైవర్ ఉగాది రంగడు(30)కు ఆదోని మండలం దొడ్డనగేరికి చెందిన సౌజన్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల మధుసూదన్ సంతానం. మొదటి నుంచీ భార్యపై రంగడికి అనుమానం ఉండేది.  కొడుకు తనకు పుట్టలేదని రంగడు తరచూ భార్యతో గొడవ పడేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇవి మరింత ఎక్కువయ్యాయి.  ఈ నేపథ్యంలోనే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భార్యాభర్తలు గొడవ పడ్డారు. మాటామాటా పెరిగింది. రంగడు ఆగ్రహంతో మధుసూదన్ రెండు కాళ్లు పట్టుకుని నేలకేసి కొట్టాడు. అప్పటికీ శాంతించక రోకలిబండతో మోదడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు