మణిదీపం

7 Mar, 2015 00:53 IST|Sakshi
మణిదీపం

బ్రెయిన్ డెడ్ అయిన రామవరప్పాడు యువకుడి అవయవాలు ఐదుగురికి దానం
 
కళ్లు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీల అందజేత
చెన్నైలోని ఓ రోగి కోసం ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నుంచి గుండె తరలింపు

 
ఇరవై రెండేళ్ల యువకుడు దేశంలోనే ఓ చారిత్రక ఘట్టానికి ఆద్యుడయ్యాడు. అవయవదానంతో   మళ్లీ సజీవుడయ్యాడు. కళ్లు, గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు ఇచ్చి ఐదుగురి ప్రాణాలను నిలిపాడు. మరో ఇద్దరికి కంటి వెలుగయ్యాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన ఆ యువకుడి అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చిన ఆ కుటుంబం ఎదుట  మానవత్వం అనే మాట సైతం చిన్నబోయింది. ఈ క్రతువుకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి ఊపిరిలూదింది.  రామవరప్పాడుకు చెందిన ఆ యువకుడి అవయవాల తరలింపులో శుక్రవారం ప్రముఖ వైద్యులు, రెండు జిల్లాల ఉన్నతాధికారులు చేసిన కృషిని పలువురు ప్రశంసించారు.
 
మంగళగిరి/లబ్బీపేట/గన్నవరం : ఆ యువకుడి పేరు తోట మణికంఠ. కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పాడు. రామవరప్పాడు నెహ్రూనగర్‌లో నివాసం. తండ్రి శ్రీనివాసరావు కొద్దికాలం కిందట మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. అనారోగ్యంతో ఉన్న తల్లి రాధమ్మను బాగా చూసుకోవాలని, సోదరి శివనాగజ్యోతిని ఉన్నత చదువులు చదివించాలని కారు డ్రైవర్‌గా మారాడు.

ఈ నేపథ్యంలో ఈనెల మూడో తేదీ అర్ధరాత్రి ద్విచక్ర  వాహనంపై విజయవాడలోని బెంజిసర్కిల్ నుంచి ఇంటికి వెళుతుండగా, సెట్విన్ ఆస్పత్రి వద్ద లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మణికంఠను చికిత్స నిమిత్తం తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరం కావడంతో అక్కడి నుంచి విజయవాడలోని మెట్రో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే, విధి మణికంఠను చిన్నచూపు చూసింది. దేహానికి ప్రాణం ఉన్నా బ్రెయిన్‌డెడ్ అవడంతో తల్లి, సోదరి తల్లడిల్లిపోయారు. కుటుంబానికి ఒకే ఒక్క ఆధారమైన మణికంఠను బతికించుకోవాలని తపన పడ్డారు. ఏ వైద్యుడిని కలిసినా లాభం లేదని చెప్పారు. అప్పటికే నర్సింగ్ విద్యనభ్యసిస్తున్న మణికంఠ సోదరి జ్యోతి తన తల్లి, బంధువులతో మాట్లాడి తమ్ముడి అవయవాలను దానం చేయాలని, మరికొందరిలో మణికంఠను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవిరాజుకు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఆయన జీవన్‌దాన్ అనే సంస్థను సంప్రదించి మణికంఠను కెడావర్ ట్రాన్స్‌ప్లాంట్ (అవయవ మార్పిడి)కు అవకాశం ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. గ్రీన్ చానల్ ద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ డీజీపీలతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించి అత్యవసరంగా అవయవాలు కావాల్సిన వారి కోసం సమాచారం పంపారు.
 
ఐదుగురికి అవయవదానం

చెన్నైలోని రోగికి గుండె, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలోని రోగికి ఒక కిడ్నీ, హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలోని రోగికి కాలేయం, గుంటూరు సిటీ ఆస్పత్రి రోగికి మరో కిడ్నీ, పెదకాకానిలోని శంకర్ కంటి ఆస్పత్రికి కళ్లను అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో చెన్నైలోని రోగికి మణికంఠ గుండెను అమర్చేందుకు ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం శుక్రవారం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గాన ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి వచ్చింది. శస్త్రచికిత్స అనంతరం మణికంఠ గుండెను సజీవంగా సాయంత్రం అదే విమానంలో చెన్నై తరలించారు. గుండెను తరలించే క్రమంలో ఇక్కడి  వైద్యులతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సహకారం అందించింది. ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా తీసుకెళ్లారు. రామవరప్పాడు సెంటర్‌లో ప్రజలు అంబులెన్‌‌సపై పూల జల్లులు కురిపించారు. వాహనదారులు ఎక్కడికక్కడ పక్కకు తప్పుకొని అంబులెన్‌‌స వెళ్లడానికి సహకరించారు.  మణికంఠ మిగిలిన అవయవాలను కూడా ఆయా ఆస్పత్రుల్లోని రోగులకు అమర్చేందుకు ఏర్పాట్లుచేశారు. మణికంఠ సోదరి శివనాగజ్యోతిని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి యాజమాన్యంతో పాటు అక్కడికి వచ్చిన వైద్యులు, ప్రముఖులు, ప్రజలు అభినందించారు. అవయవదానంతో సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
 
మా తమ్ముడు సజీవం

‘మా తమ్ముడి మృతితో మా కుటుంబం అనాథగా మారింది. అయినా అవయవాలను దానం చేయడం ద్వారా మా తమ్ముడు సజీవంగా ఉంటాడనే ఆత్మ సంతృప్తి దక్కింది. మా మణికంఠ మా నుంచి భౌతికంగా దూరమైనా ఐదుగురి ప్రాణాలను నిలిపి సజీవంగా నిలిచాడు.’ అంటూ మణికంఠ సోదరి శివనాగజ్యోతి తీవ్ర ఉద్వేగానికి లోనైంది.

మరిన్ని వార్తలు