పుట్టిన వెంటనే బ్రెయిన్‌డెడ్‌.. అంత విషాదంలోనూ దుఃఖాన్ని దిగమింగుకుని..

20 Oct, 2023 07:54 IST|Sakshi

అహ్మదాబాద్‌: నవమాసాలు మోసి కన్న తల్లికి, బిడ్డ కోసం ఎన్నో కలలు కన్న ఆ తండ్రికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. పుట్టిన బిడ్డలో బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని వైద్యులు చెప్పిన మాటలతో ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. అయితే అంత దుఃఖంలోనూ వాళ్లు తీసుకున్న నిర్ణయం.. వార్తల్లోకి ఎక్కింది.

డైమండ్‌ ఫ్యాక్టరీలో పని చేసే హర్షద్‌, చేతన దంపతులకు ఈ నెల 13న మగబిడ్డ పుట్టాడు. అయితే.. శిశువులో కదలికలేవీ లేకపోవడంతో బిడ్డను ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించి.. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఐదురోజుల తర్వాత పసికందుకు బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు.

ఈలోపు జీవన్‌దీప్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ ఫౌండేషన్‌ శిశువు తల్లిదండ్రులను సంప్రదించింది. అంత బాధలోనూ అవయవదానానికి సమ్మతించడంతో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు.  వీటిని గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో అవసరం ఉన్న ఆరుగురు చిన్నారులకు విజయవంతంగా అమర్చినట్లు సదరు ఫౌండేషన్‌ ప్రకటించింది. బ్రెయిన్‌డెడ్‌ (జీవన్మృతి) అయిన అయిదు రోజుల పసికందు అవయవాలు..  ఆరుగురు పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి.

మరిన్ని వార్తలు