ఈ ఏడాదీ అరకు ఉత్సవ్

19 Sep, 2013 02:24 IST|Sakshi
ఈ ఏడాదీ అరకు ఉత్సవ్

సాక్షి, విశాఖపట్నం : పర్యాటక దినోత్సవానికి ముందే విశాఖ జిల్లాకు ఆ శోభ వచ్చినట్టుంది. ఏటా సెప్టెంబర్ 27న టూరిజం డే నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ సారి విశాఖ పరిధిలో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంకల్పించింది. విశాఖ పర్యటనకు వచ్చిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చందనఖాన్ బుధవారం జిల్లాకు పలు వరాలు కురిపించారు. అరకు ఉత్సవ్‌ను ఈ ఏడాది కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విశాఖ, అరకు అందాలు సందర్శకుల్ని ఆకట్టుకుంటాయని, మధురానుభూతికి లోనవుతుంటారని కొనియాడారు.

ఇక్కడి సుందర దృశ్యాలను ప్రపంచం మొత్తానికి తెలిపేందుకు సోషల్ మీడియా, ఎయిర్‌పోర్టుల్లో వివరాల్ని పొందుపరుస్తామన్నారు. విశాఖలో ఏడాదిలోగా ఏర్పాటు కానున్న హెల్త్‌సిటీ, కన్వెంక్షన్ హాలు, వాటర్ అక్వేరియం తదితర ప్రాజెక్టులు సందర్శకుల్ని అలరిస్తాయన్నారు. విశాఖ ఉత్సవ్ నిర్వహణకు పుష్కలంగా అవకాశాలున్నా ఏటా ఏవేవో అడ్డంకులతో వాయిదా వేయాల్సివస్తోందన్నారు.మూన్‌ల్యాండ్ ప్రాజెక్టును పరిశీలిస్తున్నామన్నారు. డిజైన్, లొకేషన్ సరిగా లేని కారణంగా డచ్ విలేజ్  ప్రాజెక్టు రద్దుకు నిర్ణయించామన్నారు.

 అరకు ట్రైన్, తిరుపతి విమానం

 సందర్శకులు మరింత అనుభూతికి లోనయ్యేలా విశాఖ-అరకు ప్రత్యేక రైలు ప్రాజెక్టు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని చందనఖాన్ తెలిపారు. టూరిజం ఆధ్వర్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా విశాఖ-తిరుపతి విమాన సర్వీసుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రాజధానిలో ఈ తరహా ప్రాజెక్టుకు మంచి స్పందనే ఉందని, అయితే స్పైస్‌జెట్ సంస్థతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ తరహాలో విశాఖలోనూ టూరిజం పోలీసులను నియమిస్తున్నామన్నారు. పర్యాటక ప్రాజెక్టులు, కార్యలయాలు, అతిథి గృహాల వద్ద భద్రత సిబ్బంది ఉంటారన్నారు. ఉత్తరాంధ్రలోనే కీలకమైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వచ్చే ఏడాది జనవరి నాటికి పలు ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్నారు. ఏజెన్సీలో సుమారు రూ.80కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఐఎల్‌ఎఫ్‌ఎస్ కన్సల్టెన్సీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు.

 ప్రైవేట్ పెట్టుబడులు రావాలి

 పబ్లిక్/ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టుబడులు వస్తే పర్యాటకాభివృద్ధి పనులు వేగవంతమవుతాయని చందనఖాన్ అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి లోపాలుంటున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నలకు శ్రీనివాస్ కూడా సమాధానమిచ్చారు. ఇకపై ఎంపవర్ కమిటీ సూచనల మేరకు పనులు చేపడతామన్నారు. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రాజెక్టుపై నివేదిక పంపించే సమయానికి, పనులు ప్రారంభమయ్యేనాటికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోందన్నారు.

ప్రాజెక్టులు ప్రారంభమైతే లబ్ధి చేకూరుతుందని, అయితే విశాఖలో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి 28మంది పెట్టుబడిదారులు ముందుకు వచ్చారని, బ్యాంకు గ్యారెంటీతో లీజ్‌కు సిద్ధమైతే పనులు ప్రారంభించడమే తరువాయి అని చెప్పారు. కొన్ని టూరిజం ప్రాజెక్టుల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయక తప్పదన్నారు. చందనఖాన్ వెంట ఓఎస్‌డీ వి. మధుసూధన్, జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ, వుడా వీసీ డా. యువరాజ్, అదనపు కమిషనర్ జానకి, బీచ్‌కారిడార్ ప్రత్యేక అధికారి భీమశంకర్రావు, టూరిజం విభాగం అధికారులు, సిబ్బంది ఉన్నారు.
 

మరిన్ని వార్తలు