బోధకులు అరకొరే! | Sakshi
Sakshi News home page

బోధకులు అరకొరే!

Published Thu, Sep 19 2013 2:19 AM

Possessing a shortage of teachers in public schools

మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్:  ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నుంచి కా..స్త ఉపశమనం కలిగినట్లే. జిల్లా విద్యాధికారుల అభ్యర్థన మేరకు విద్యాబోధకుల(అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్) నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం ఈ మేరకు జిల్లాకు 123 మంది విద్యాబోధకులను నియమించింది. అలాగే ఉర్దూ మీడియం పాఠశాలల్లో 84 మంది విద్యాబోధకుల పోస్టులను కేటాయించింది. అయితే  జిల్లాకు 990 మంది విద్యాబోధకులు అవసరం ఉండగా, కేవలం 123 పోస్టులు మాత్రమే కేటాయించడంతో అధికారులు ఈ అరకొర పోస్టులు ఎక్కడ కేటాయించాలనే విషయమై ఆలోచనలోపడ్డారు.
 
 బడిబయటి పిల్లలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఈ పోస్టులను కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా పోస్టులు తక్కువగా ఉండటంతో ప్రభుత్వం చెల్లించాలని భావించిన రూ.ఐదువేలు ఉన్న వేతనాన్ని రూ.మూడువేలకు కుదించి జిల్లాలో పోస్టుల సంఖ్యను పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యాబోధకులుగా బీఈడీ, డీఈడీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను రోస్టర్, మెరిట్ పద్ధతిన తీసుకుంటారు. ఈ నియామక  ప్రక్రియను మరో పదిరోజుల్లో పూర్తిచేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
 
 తక్కువ వేతనం..ఎక్కువ పోస్టులు
 జిల్లాలో మొత్తం 990 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 123 మంది వి ద్యాబోధకులను నియమించుకునేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని, ఒక్కో ఉపాధ్యాయుడు ఉండి పాఠశాలను నడిపిస్తున్న జిల్లాకు ప్రస్తుతం కేటాయించిన పోస్టులు ఎక్కడా సరిపోవు. అయితే ఈ సమస్యలను తగ్గించేందుకు కలెక్టర్ ఆదేశానుసారం ఆర్వీఎం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఉపాధ్యాయుల కొరత, బడిబయటి పిల్లలు ఎక్కువగా ఉన్న 27 మండలాలకు మాత్రమే విద్యాబోధకులను నియమించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. గట్టు మండలానికి 20, ధరూర్‌కు 15, ఐజకు 15, గద్వాలకు 3, దౌల్తాబాద్‌కు 10, మల్దకల్‌కు 8, పెద్దకొత్తపల్లికు 6, నారాయణపేటకు 02, వెల్దండకు 3, కొడంగల్‌కు 5, అమ్రాబాద్‌కు 15, అచ్చంపేటకు 15, లింగాలకు 10, ఉప్పునుంతలకు 5, బల్మూర్‌కు 5, అలంపూర్‌కు 5, పెద్దమందడికి 8, ధన్వాడకు 2, వంగూరుకు 3, మక్తల్‌కు 5, మాగనూర్‌కు 8, మద్దూరుకు 5, కోస్గికి 8, మహబూబ్‌నగర్  మండలానికి 5, కోడేరు మండలానికి 5, నర్వ మండలానికి 6, బోంరాస్‌పేట మండలానికి 8 పోస్టుల చొప్పున 27 మండలాలలకు 205 పోస్టులను కేటాయించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.
 
 అదేవిధంగా ఉర్దూపాఠశాలల్లోనూ 84 నుంచి 140 వరకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు లేని పాఠశాలలతో పాటు బడిబయటి పిల్లలు ఎక్కువగా ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో నియామకాలకు ప్రాధాన్యం ఇస్తారు. వీరికి వేతనాలు చెల్లించేందుకు అవసరమయ్యే రూ.45లక్షలను ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ లేదా ఆర్‌ఎస్‌టీసీ విభాగాల నుంచి తీసుకుంటారు. ఏదేమైనా ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్న పాలమూరు జిల్లాకు విద్యాబోధకుల సంఖ్యను పెంచి నియామకాలు చేపట్టాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
 
 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి
 పోస్టులు తక్కువగా రావడం వల్ల ఎక్కడ ఏవిధంగా కేటాయించాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు నియామకాలు చేపడుతాం. ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయాన్ని కలెక్టర్ ఎ స్పీడీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. త్వరలో దరఖాస్తులు స్వీకరించి 10రోజులల్లో విద్యాబోధకుల ప్రక్రియను పూర్తిచేస్తాం.
 - పద్మహర్ష,
  పీఓ, రాజీవ్ విద్యామిషన్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement