లాటరీ షురూ

30 Jun, 2015 02:37 IST|Sakshi
లాటరీ షురూ

- ఆలస్యంగా ప్రారంభమైన ప్రక్రియ
- ఒకరికి ఒక షాపే కేటాయింపు
- సౌకర్యాలు నిల్
- ఆందోళనకు దిగిన టెండరుదారులు
మచిలీపట్నం :
లాటరీ పద్ధతిలో మద్యంషాపుల కేటాయింపు ప్రక్రియ కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం జరిగింది. జిల్లాలో 335 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో 33 మద్యం దుకాణాలను ప్రభుత్వం ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. మిగిలిన 302 షాపులకు టెండర్లు ఆహ్వానించగా 294 మద్యం దుకాణాలకు 6,995 దరఖాస్తులు వచ్చాయి. ఎనిమిది మద్యం షాపులకు అసలు టెండర్లు దాఖలు కాలేదు. 29 మద్యం దుకాణాలకు సింగిల్ టెండర్లు వచ్చాయి.

తొలుత సింగిల్ టెండర్లు దాఖలు చేసిన వారికి షాపులను కేటాయించారు. కలెక్టర్ బాబు.ఎ, జేసీ గంధం చంద్రుడు, ట్రైనీ కలెక్టర్ సలోమి సైదాని, ఎక్సైజ్ డీసీ బాబ్జిరావు, మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్‌శాఖ ఈఎస్‌లు జి.మురళీధర్, ఎంవీ రమణ పర్యవేక్షణలో లెసైన్సులను జారీ చేశారు. ఒక్కో షాపునకు వచ్చిన టెండర్ల ఆధారంగా టెండరు దాఖలు చేసిన వారిని పేర్ల వారీగా పిలిచి వారి సమక్షంలోనే లాటరీ తీశారు.
 
ఆలస్యంగా ప్రారంభం
లాటరీ ప్రక్రియ ఉదయం 10.30కు ప్రారంభమవుతుందని ప్రకటించినా 11.45కు ప్రారంభించారు. సింగిల్ టెండర్లు దాఖలు చేసిన వారికి లెసైన్సులు జారీ చేయగా, 11.55కు మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని ఒకటో నంబరు షాపును లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. అనంతరం కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి వెళ్లారు. జేసీ గంధం చంద్రుడు, బందరు ఆర్డీవో సాయిబాబు, ఎక్సైజ్ అధికారులు ఆయా షాపులకు వచ్చిన దరఖాస్తులు, టెండరు బాక్సుల్లో ఉన్న దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించారు. సాయంత్రం 5గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న అనంతరం లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపును జేసీ ప్రారంభించారు.
 
ఒకరికి ఒక షాపే

మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని షాపులకు చంద్రుడు, విజయవాడ ఈఎస్ పరిధిలోని మద్యం దుకాణాలకు బందరు ఆర్డీవో సాయిబాబు లాటరీ తీశారు. సింగిల్ టెండర్లు దాఖలు చేసిన వారు, లాటరీ పద్ధతిలో ఒక షాపు దక్కించున్నవారిని గుర్తించి మిగిలిన షాపులకు నిర్వహించే లాటరీలో వారి పేర్లు తొలగిస్తున్నట్లు జేసీ ప్రకటించారు. ఒకరి పేరున ఒక షాపు మాత్రమే కేటాయించటం జరుగుతుందని తెలిపారు. అర్ధరాత్రి సమయానికీ లాటరీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. లాటరీలో మద్యం దుకాణం దక్కించుకున్న వారికి చలానాలు ఇచ్చి, లెసైన్సు ఫీజులోని 25 శాతం నగదును ఎక్సైజ్‌శాఖ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని అధికారులు సూచించారు.

టెండరుదారుల ఆందోళన
లాటరీలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి టెండరుదారులు తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. ఎక్సైజ్ అధికారులు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవటం, తాగునీటిని అందుబాటులో ఉంచకపోవటంతో టెండరుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి కూడా మద్యం షాపుల కేటాయింపు ప్రారంభం కాకపోవటం, సౌకర్యాలు లేకపోవటంతో అంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలు వద్దకు వెళ్లి తమదైన శైలిలో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

సీఎం వస్తే వేలాది కుర్చీలు వేస్తారని, లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లించిన తమకు కూర్చునేందుకు కుర్చీలు వేయలేదని, తాగునీరు అందుబాటులో ఉంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నిమిషాల పాటు ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న జేసీ బయటకు వచ్చి దరఖాస్తులు అధికంగా ఉండటంతో వాటన్నింటినీ పరిశీలించటంలో ఆలస్యం జరుగుతోందని సర్ది చెప్పారు. పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు చేస్తామని నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు. మహిళలు కూడా రావడంతో కొంత ఇబ్బందులు పడ్డారు.

భారీగా పోలీస్ బందోబస్తు
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో టెండరుదారులు తరలిరాగా వారి వాహనాలను కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు. కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, కలెక్టర్ బంగ్లాకు వెళ్లే రోడ్డు, జిల్లాపరిషత్ రోడ్డు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ జిల్లా పరిషత్ ప్రాంగణంలో కార్లు బారులు తీరాయి. కలెక్టరేట్‌కు ఉన్న మూడు ప్రధాన గేట్ల వద్ద ఎక్సైజ్ శాఖ జారీచేసిన పాస్‌లు ఉన్న వారినే లోనికి అనుమతించారు.

మరిన్ని వార్తలు