నలుగురిని బలిగొన్న ‘వడ్డీ’ వ్యాపారం!

30 Mar, 2014 02:19 IST|Sakshi
నలుగురిని బలిగొన్న ‘వడ్డీ’ వ్యాపారం!

విజయవాడ, న్యూస్‌లైన్ : ‘అధిక వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాను.. నా భార్య పేరిట ఉన్న ఆస్తి ఇమ్మని వేడుకున్నా.. పిల్లల ముఖం చూసైనా ఇవ్వండి అన్నా.. అత్త వెంకటేశ్వరమ్మ, బావమరిది గోపాలకృష్ణ ఇవ్వకపోగా వేధింపులకు గురిచేస్తున్నారు. కొద్ది రోజులుగా మనస్థాపానికి గురైన మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. అత్త, బావమరిదిపై కఠిన చర్యలు తీసుకోండి’ అంటూ కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడిన రాము రాసినట్టుగా చెపుతున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
విజయవాడలోని గులాబీతోట నేతాజీ రోడ్డుకు చెందిన పిన్నింటి రాము (29) చుట్టుగుంట అల్లూరి సీతారామరాజు వంతెన సమీపంలో శ్రీసాయి బాలాజీ పెరల్స్ అండ్ బెంటెక్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఏడేళ్ల కిందట మచిలీపట్నానికి చెందిన లతతో అతనికి వివాహమైంది. కొద్దిరోజులకే వీరి మధ్య మనస్ఫర్థలు రావడంతో విడిపోయారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది.

ఏప్రిల్ నాలుగున కోర్టు వాయిదా ఉన్నట్టు చెపుతున్నారు. వారు విడిపోయిన తర్వాత అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన భాగ్యలక్ష్మి (25)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు యశ్వంత్ (5), రోషిణి (3). సీతారామరాజు వంతెన సమీపంలోనే తల్లిదండ్రులు, సోదరులు ఉంటున్నా.. భార్యతో కలిసి గులాబీతోటలో రాము ఉంటున్నాడు. షాపు సమీపంలో అవసరం కోసం వచ్చే వారి వద్ద బంగారు నగలు కుదువ పెట్టుకొని వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడు. వీరి వద్ద తీసుకున్న నగలు పాతబస్తీలో కుదువ పెడుతున్నట్టు పలువురు చెపుతున్నారు.

ఇటీవల కొంతకాలంగా నగలు కుదువ పెట్టిన పలువురు తీసుకునేందుకు రాగా.. ఎన్నికల తర్వాత ఇస్తానంటూ చెప్పసాగాడు. అనేక మంది తమ వద్ద డబ్బులు అయిపోతాయని చెప్పినా, ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేయసాగాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆరు గంటలైనా ఇంట్లోనుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా విగతజీవులై పడివున్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న సెంట్రల్ జోన్ ఏసీపీ కె.లావణ్య లక్ష్మి, మాచవరం ఇన్‌స్పెక్టర్ పి.మురళీకృష్ణారెడ్డి హుటాహుటిన సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు.
 
అధిక వడ్డీలే కారణమా
 
రాము ఇక్కడి పలువురు మహిళల నుంచి నగలు తీసుకొని పాతబస్తీలో కుదువ పెట్టి సొమ్ము తీసుకొచ్చి ఇస్తుంటాడు. వీరు అడిగిన మొత్తం కంటే ఎక్కువ తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో వడ్డీ చెల్లించిన వారి నగలు తీసుకొచ్చేందుకు కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయించి ఉండొచ్చని తెలుస్తోంది. లేదా అక్కడ తీసుకొచ్చిన మొత్తంతో భారీ ఎత్తున కాల్‌మనీ వ్యాపారం చేసి ఉంటాడని, ఇటీవల పోలీసుల చర్యలతో అప్పులు ఇచ్చిన వాళ్లు తిరిగి చెల్లించి ఉండకపోవచ్చని స్థానికులు చెపుతున్నారు.

దీంతో కుదువపెట్టిన నగలు విడిపించలేని స్థితిలో వాయిదాలు వేస్తూ వచ్చి ఉండొచ్చని.. ఈలోగా భార్య వాటాగా వచ్చిన స్థలాలు అమ్మేసి అప్పులు తీర్చేద్దామని నిర్ణయించుకుని ఉంటాడని భావిస్తున్నారు. వెంటనే ఆస్తులు అమ్మి సొమ్ము ఇచ్చేందుకు అత్తింటి వారు అంగీకరించకపోవడంతో పిల్లలు, భార్య సహా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని చెబుతున్నారు.  రాము ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పడు తమ పరిస్థితేమిటని నగలు కుదువపెట్టిన బాధితులు  ఆందోళనకు గురవుతున్నారు.
 

మరిన్ని వార్తలు