యువతిపై మరో దారుణం

30 Jan, 2014 04:39 IST|Sakshi

రాష్ట్ర రాజధానిలో కీచకపర్వం
 లైంగికదాడికి యత్నించిన నలుగురు యువకులు
ప్రతిఘటించినందుకు కిరోసిన్ పోసి హత్యాయత్నం

 
 సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మరో దారుణం.. పట్టపగలు ఓ యువతిపై సామూహిక లైంగికదాడి యత్నం.. ప్రతిఘటించడంతో కిరోసిన్ పోసి నిప్పంటించిన అమానుషత్వం. దేశవ్యాప్తంగా మహిళలపై కొనసాగుతున్న అకృత్యాలకు మరో నిలువెత్తు నిదర్శనం బుధవారం హైదరాబాద్ నడిబొడ్డున వెలుగుచూసింది.
 
 వివరాలు: హైదరాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సలాం, సాజిదా బేగంలు భార్యాభర్తలు.  భర్త నుంచి 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న సాజిదా.. కుమార్తె అర్షియా ఫాతిమా అలియాస్ సమ్రీన్ (22), కుమారుడు అజీజ్‌తో కలసి అదేప్రాంతంలో నివసిస్తోంది.
     బుధవారం మధ్యాహ్నం వారాసిగూడ కౌసర్ మసీదు ప్రాంతానికి చెందిన ఇసాక్ నుంచి ఫోన్ రావడంతో సమ్రీన్ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ సమీపంలో మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేస్తూ పరిగెత్తుకుంటూ రోడ్డు పైకి వచ్చి పడిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు రగ్గుల సాయంతో మంటల్ని ఆర్పి, పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. బాధితురాలిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు.
 
     గట్టిగా కేకలు వినిపించడంతో బయటకు వచ్చామని, అప్పటికే మంటలు అంటుకున్న ఆమె రోడ్డుపై పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు రమేష్, విజయ్‌కుమార్ తెలిపారు. తాము మంటల్ని ఆర్పిన తరవాత ఓ బెడ్‌షీట్ అందించగా లేచి నిలబడి దాన్ని కట్టుకుందని తెలిపారు.
     పోలీసులు గాంధీ ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాలు.. ‘ఇసాక్ నాకు ఫోన్ చేసి బయటకు రమ్మన్నాడు. ఇసాక్‌తో పాటు షకీల్, ఇస్మాయిల్, షాకత్‌లు కూడా ఉన్నారు. ఆ నలుగురు నన్ను బలవంతంగా పాడు బడిన  రైల్వేక్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నాపై లైంగికదాడికి ప్రయత్నించారు. నేను ప్రతిఘటించడంతో వారు నాపై కిరోసిన్‌ను పోసి నిప్పంటించారు’.
     బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలితో పాటు గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
     ఇసాక్, సమ్రీన్‌లకు పాత పరిచయం ఉన్నట్లు తెలియడం, బాధితురాలికి మంగళవారమే పెళ్లి చూపులు జరగడంతో.. దానికి, ఈ ఉదంతానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
     బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే జయసుధ బాధితురాలిని పరామర్శించారు.

>
మరిన్ని వార్తలు