సెల్‌ఫోన్లు వాడుతున్నా ఉత్తరాలు రాస్తుండాలి

29 Jan, 2019 07:55 IST|Sakshi

గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి అవస్థలు

ఏజెంట్ల మోసాలు.. యాజమాన్యాల వేధింపులు

అవగాహన లేమితో కష్టాలు కొనితెచ్చుకుంటున్న బాధితులు

కోటి ఆశలతో ఎదురు చూస్తున్న కుటుంబసభ్యులు

‘కూలి కోసం.. కూటి కోసం.. పట్టణంలో బతుకుదామని.. తల్లి మాటను చెవిన బెట్టక.. బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం.. ఎంత నష్టం..’ అన్న శ్రీశ్రీ మాటలు ఇక్కడ మనకు స్ఫురణకు వస్తాయి.. ఎడారి దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి బతుకు పోరాటం సాగిస్తున్న అభాగ్యుల దీనగాథలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.. ఏజెంట్ల మోసాలు, గల్ఫ్‌ దేశాల్లో యాజమాన్యాల వేధింపులతో ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడ ఉండలేక.. ఇక్కడకు రాలేక.. ఎందరో బాధితులు అల్లాడుతున్నారు. ఇలాంటి వారిలో జిల్లావాసులు వందల్లో ఉన్నారు. కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లులు.. భర్త కోసం వేచిచూస్తున్న మహిళలు.. తండ్రి క్షేమంగా రావాలని కోరుకుంటున్న బిడ్డలు.. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. విదేశాల్లో ఉద్యోగాలపై అవగాహన లేకపోవడం, సరైన పత్రాలు లేకుండా గల్ఫ్‌ వెళ్లడం వంటివి వీరి కష్టాలకు కారణమవుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి మృతదేహాలు స్వగ్రామాలకు రావడం కూడా కష్టమవుతోంది.

పశ్చిమగోదావరి , తాడేపల్లిగూడెం/పాలకొల్లు టౌన్‌ / పోడూరు: జిల్లాలోని పలువురు మహిళలు, నిరుద్యోగ యువకులు పొట్టచేత పట్టుకుని గల్ఫ్‌ దేశాలతో పాటు మలేషియా, సింగపూర్‌ వంటి దేశాలకు వెళుతున్నారు. ఎడారి దేశాలకు వెళ్లిన తర్వాత వీరు పడేపాట్లు వర్ణనాతీతం. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మృతి చెందితే వారి మృతదేహాలు కుటుంబ సభ్యులకు చేరడానికి నెలలు పట్టే పరిస్థితి. ఇదిలా ఉంటే జిల్లాలోని కొందరు ఏజెంట్లు గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలను, యువకులను బుట్టలో వేసుకుని ప్రభుత్వ అనుమతి లేకుండా దొడ్డిదారిన విజిటింగ్‌ వీసాలపై పంపుతున్నారు. ఇలా వీరి వలలో చిక్కిన వారు అష్టకష్టాలు పడుతున్నారు. గల్ఫ్‌ పోలీసుల కంటపడి జైలు గదుల్లో ఎందరో మగ్గుతున్నారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఏళ్లు గడుస్తున్నా వారి జాడ తెలియక ఇక్కడ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రం నుంచి 20 లక్షల మంది..
ప్రవాస భారతీయ మంత్రిత్వశాఖ ఇటీవల పార్లమెంటులో వివరాలు ప్రకటించింది. ప్రపంచంలోని 184 దేశాల్లో సుమారు మూడు కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఆరు అరబ్‌ గల్ఫ్‌ దేశాల్లో సుమారు 60 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు గల్ఫ్‌లో సుమారు 20 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలోని 17 దేశాలకు ఉద్యోగాలకు వెళ్లాలనుకునే భారతీయ కార్మికులు ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఎమిగ్రెంట్స్‌ (పీఓఈ) (వలసదారుల సంరక్షకులు) వారి కార్యాలయం ద్వారా ఎమిగ్రేషన్‌ క్లియరెన్సు (వలస వెళ్లడానికి అనుమతి) తీసుకోవాలి.

ఈ దేశాలకు వెళితే జాగ్రత్త
బహెరిన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమన్, యూఏఈ, ఆప్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేషియా, సూడన్, యెమెన్, ఇండోనేషియా, థాయిలాండ్‌ వెళ్లే వారు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

ప్రవాస కార్మికుల హక్కులు స్వదేశం నుంచి విదేశానికి వెళ్లడానికి,రావడానికి స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు 
బానిసత్వానికి, బలవంతపు చాకిరీకి వ్యతిరేకంగారక్షణ పొందే హక్కు
ఆలోచన, మనస్సాక్షి, మత విషయంలోస్వేచ్ఛగా ఉండే హక్కు
హింస, అవమానమైన అణచివేత లేదా శిక్షల నుంచి స్వేచ్ఛగా ఉండే హక్కులు ప్రవాస కార్మికులకు ఉంటాయి.

అండగా మహాసేన
జిల్లాలోని ఉపాధి కోసం వెళ్లిన కొందరు ఉద్యోగులు మహాసేన స్వచ్ఛంద గ్రూపును ఏర్పాటు చేసుకుని కువైట్‌లో ఎవరికైనా ప్రమాదం జరిగితే సాయం అందిస్తున్నారు. ఎవరైనా మృతిచెందితే మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేలా కృషిచేస్తున్నారు. ఇలా పాలకొల్లు మండలం పెదగరువుకి చెందిన కోటి జోగామణి ఇటీవల కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే మహాసేన స్వచ్ఛంద సంస్థ అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చేరేలా చేశారని ఆమె భర్త రామకృష్ణ చెప్పారు.

అవగాహన లేమితోనే కష్టాలు
ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారికి చేసే ఉద్యోగం, వచ్చే ఆదాయంపై అవగాహన ఉండటం లేదు. టూరిస్టు వీసాపై వెళ్లి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు థాయిలాండ్‌ వెళ్లాలంటే ఈ దేశం వచ్చే వ్యక్తి వద్ద ఇంత సొమ్ము ఉండాలనే నిబంధన ఉంది. గల్ఫ్‌ దేశాల్లో అలాంటి నిబంధనాలు లేవు. గల్ఫ్‌ దేశం వెళ్లే వారికి అవగాహన కోసం రాష్ట్రంలో హోమ్‌ క్యాప్‌ అనే సంస్థను ఏర్పాటుచేశారు. ఇతర దేశాలకు వెళ్లే వారు కనీసం ఈ సంస్థను సంప్రదించడం లేదు. జిల్లా నుంచి ఏటా 12 వేల మంది వరకు గల్ఫ్‌ దేశాలకు వెళుతున్నారు. విజిటింగ్‌ వీసాలపై వెళ్లి మహిళలు కట్టు బానిసలుగా, వ్యభిచారం కూపంలోకి నెట్టబడుతున్నారు. పురుషులు ఎడారిలో ఒంటెల దగ్గర, గొర్రెల దగ్గర, ఎండ, చలి బాధలను తట్టుకోలేక అనారోగ్యానికి గురై ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి వారికి సహాయం కోసం ప్రవాసాంధ్రుల సేవా కేంద్రం పనిచేస్తుంది. రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే మ్యాన్‌ పవర్‌ సరఫరాకు సంబంధించి అ««ధికారిక ఏజెన్సీలు లేవు. పోగొట్టుకున్న పత్రాలు సమకూర్చడం, బీమా భరోసా అందుబాటులోకి తేవడం, నైపుణ్య శిక్షణ,  విద్యాసాయం, మృతి చెందిన వ్యక్తుల కుటుంబీకులకు ఖననం నిమిత్తం ఆర్థిక సాయం, మృతదేహాలను సొంత ప్రాంతానికి చేర్చడానికి ఉచితంగా ఎయిర్‌పోర్టు నుంచి అంబులెన్సు సదుపాయం వంటి సేవలు ప్రవాసాంధ్రుల సేవాకేంద్రం ద్వారా అందిస్తున్నాం. జాగ్రత్తలు తీసుకుని గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్లాలి.– గట్టిం మాణిక్యాలరావు, ప్రవాసాంధ్రుల సేవా కేంద్రం, తాడేపల్లిగూడెం

ఇవి పాటించాలి
పాస్‌పోర్టు దరఖాస్తులో ఇంటిపేరు, పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, జీవిత భాగస్వామి (భర్త లేదా భార్య) పేరు స్పష్టమైన స్పెల్లింగ్‌తో రాయాలి. జన్మస్థలం. పుట్టినతేదీ, చిరునామా, విద్యార్హతలు సరిగా పేర్కొనాలి. తప్పులు లేకుండా పాస్‌పోర్టు పొందాలి.
ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి.
విదేశాలకు వెళ్లే ముందు వైద్యారోగ్య పరీక్షలు చేయించుకోవాలి. విదేశాల్లో మెడికల్‌ చెకప్‌లో ఫెయిల్‌ అయితే ఉద్యోగం నుంచి తొలగించిఇంటికి పంపిస్తారు.
ఏ దేశానికి ఏ పనిమీద వెళ్లాలనుకుంటున్నారో స్పష్టత కలిగి ఉండాలి.
విజిట్‌ వీసా, ఆజాద్‌ వీసా, ఫ్రీ వీసా, ఖఫాలత్‌ వీసా, ప్రైవేట్‌ వీసాలపై విదేశాలకు వెళ్లకూడదు. చట్టబద్ధమైన కంపెనీల వీసాలపై మాత్రమే వెళ్లాలి.
ప్రవాసీ భారతీయ వ్యవహారాల శాఖ, ప్రొటెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఏమిగ్రెంట్స్‌తో జారీచేయబడ్డ లైసెన్స్‌ కలిగిన రిజిస్టర్డ్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లాలి.
విదేశీ యాజమాన్యం నుంచి పొందిన డిమాండ్‌ లెటర్, పవర్‌ ఆఫ్‌ అటార్నీ పత్రాలు ఉన్న ఏజెంట్‌ ద్వారా మాత్రమే వెళ్లాలి.
ఇండియన్‌ ఎంబసీచే ధ్రువీకరించబడిన అరబ్బీతో పాటు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో గల ఉద్యోగ ఒప్పందపత్రం కలిగి ఉండాలి. ఉద్యోగ ఒప్పంద పత్రం శ్రామికుడి హక్కులను కాపాడుతుంది.
ఇమిగ్రేషన్‌ యాక్టు 1983 ప్రకారం సబ్‌ ఏజెంట్లకు అనుమతి ఉండదు. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు వారితో సంప్రదించకూడదు.
కనీసం ఆరు నెలలపాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు ఉండేటట్టు చూసుకోవాలి. చెల్లుబాటులో ఉన్న వీసా తప్పకుండా పాస్‌పోర్టుపై స్టాంపింగ్‌ అయ్యి ఉండాలి. విడిగా వీసా అయినా ఉండాలి.
విదేశాలకు ఉద్యోగానికి వెళ్లడానికి సర్వీస్‌ చార్జీగా 45 రోజుల వేతనం (రూ.20 వేలకు మించకుండా) మాత్రమే ఏజెంట్‌కు చెల్లించాలి. చెల్లింపులు డిమాండ్‌ డ్రాప్టు లేదా చెక్కు ద్వారా చెల్లించాలి. రసీదు తప్పక తీసుకోవాలి.
విదేశాలకు వెళ్లేటప్పుడు పాసుపోర్టు, వీసా తదితర అన్నిరకాల డాక్యుమెంట్ల జెరాక్స్‌ సెట్‌ను కుటుంబసభ్యులకు ఇచ్చి వెళ్లాలి.
ముఖ్యమైన టెలిఫోన్‌ నంబర్లను గుర్తుంచుకోవాలి.

విదేశానికి వెళ్లిన తర్వాత..
విదేశానికి చేరిన తర్వాత సాధ్యమైనంత త్వరగా రెసిడెంట్‌ పర్మిట్, వర్క్‌ పర్మిట్, ఐడెంటిటీ కార్డు, లేబర్‌ కార్డు, అఖామా, బాతాకా పొందాలి.
ఉపాధి కోసం విదేశాల్లో ఉన్న చట్టాలను సంప్రదాయాలను పాటించాలి, గౌరవించాలి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విలాసాలు వీడాలి.
విదేశాల్లో ఉద్యోగాలు శాశ్వతం కాదు. ప్రపంచంలోని పరిస్థితులు, ఉద్యోగం చేస్తున్న దేశంలో సంభవించే పరిణామాల వల్ల ఏ క్షణంలోౖ¯ð నా ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న çస్పృహతో అప్రమత్తంగా ఉండాలి.
అరబ్, గల్ఫ్‌ దేశాల్లో యజమాని నుంచి పారిపోయి వేరేచోట పనిచేయడం వల్ల అక్రమ వాసులు(ఖల్లివెల్లి)గా మారి తమ హక్కులను కోల్పోతారు.
ఓవర్‌ టైం పనిచేయమని ఒత్తిడి చేసే అధికారం యజమానికి లేదు. ఇష్టమైతే అదనపు పనికి, అదనపు వేతనం ఇస్తేనే ఓవర్‌ టైం చేయాలి. వారానికి ఒక రోజు సెలవు పొందడం హక్కు.
గల్ఫ్‌ దేశాల చట్టాల ప్రకారం సమ్మె, ఆందోళనలు నిషేధం.
మహాత్మాగాంధీ ప్రవాసి సురక్షా (ఎంజీపీఎస్‌వై), సాంఘిక భద్రతా పొదుపు పథకంలో చేరాలి. జీవిత బీమా, వాపసు వచ్చాక పునరావాసం, వృద్ధాప్య పింఛన్‌ సౌకర్యం పొందాలి.
కార్మికుడి పొదుపునకు ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా కొంత ప్రోత్సాహక చందా జమచేస్తుంది.
విదేశాల నుంచి డబ్బును పంపడానికి, పొదుపుకోసం సొంత ఊరిలో ఉన్న బ్యాంకులో ఎన్‌ఆర్‌ఐ ఖాతాను తెరవాలి.
సెల్‌ఫోన్లు వాడుతున్నా రెండు, మూడు నెలలకు ఒకసారి కుటుంబసభ్యులకు ఉత్తరాలు రాస్తుండాలి. పోస్టు ద్వారా వచ్చే ఈ ఉత్తరాలపై ఉన్న ముద్రలు ఆపద కాలంలో ఉపయోగపడవచ్చు.
విదేశాలలో ఇబ్బంది ఉంటే సమీపంలోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించవచ్చు.

జిల్లాలోని పోడూరు మండలం జిన్నూరుకి చెందిన కేతలి దుర్గారావు ఐదేళ్ల క్రితం ఆయిల్‌పామ్‌ తోటల్లో పనిచేసేందుకు మలేషియా వెళ్లాడు. అక్కడ నాలుగు నెలలు బాగానే పనిచేశాడు. తర్వాత ఏమైందో తెలియదు. అప్పటినుంచి దుర్గారావు నుంచి ఇంటికి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో మంచాన పడిన భార్య రెండు రోజులక్రితం మృతిచెందింది. వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు తేజ సత్యశ్రీ, షరీఫ్‌ అతడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దుర్గారావును పోలీసులు తీసుకువెళ్లారని ఓసారి తోటి కూలీ అక్కడి నుంచి ఫోన్‌ చేసి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో అప్పట్లో కుటుంబసభ్యులు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. బిడ్డ రాకకోసం తల్లి, తండ్రి రాకకోసం పిల్లలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తన కోడలు దుర్గారావు కోసం బెంగపెట్టుకుని అనారోగ్యంతో రెండు రోజులక్రితం కన్నుమూసిందని తల్లి కేతలి కమల బోరుమంటున్నారు.

మరిన్ని వార్తలు