టీ సర్కారు 36 జీవోపై కోర్టుకు వెళతాం

31 Jul, 2014 02:31 IST|Sakshi
టీ సర్కారు 36 జీవోపై కోర్టుకు వెళతాం

ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 36 రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఈ జీవో జారీ చేయడం ద్వారా సీఎం కేసీఆర్ రాజ్యాంగ హక్కులను కాలరాశారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు. ఆయన బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి అడ్మిషన్లను పదేళ్లపాటు కొనసాగించాలన్న నిబంధనకు ఈ స్థానికత జీవో తూట్లు పొడిచినట్లుందన్నారు. 1956కు ముందున్న వారినే స్థానికులుగా పరిగణించాలంటూ జారీ చేసిన ఈ జీవోపై కోర్టుకు వెళతామని, దీనిపై ఇప్పటికే అడ్వొకేట్ జనరల్(ఏజీ)ను సంప్రదించానని తెలిపారు.

తాము చేసే న్యాయపోరాటంలో తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రా వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్.. ఇప్పుడు వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చేందుకు అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందన్నారు. 1956 తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన ఆదాయాన్ని కేసీఆర్ వెనక్కు ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం కేసీఆర్‌కు తగదన్నారు.
 
 

మరిన్ని వార్తలు