ఆతిథ్యం.. అదిరింది..!

25 Nov, 2018 09:24 IST|Sakshi

∙అతిథి దేవోభవ అంటూ నిర్వాహకుల చక్కటి ఏర్పాట్లు

హోస్ట్‌–గెస్ట్‌ రిలేషన్‌ బాగుందంటూ కితాబు

కడప స్పోర్ట్స్‌ : అతిథి దేవుడితో సమానం.. అనే సూక్తిని బ్యాడ్మింటన్‌ నిర్వాహకులు వంట పట్టించుకుని చక్కటి ఏర్పాట్లతోపాటు వచ్చిన అతిథులకు సేవలందిన్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంతో ఉత్తర భారతం, దక్షిణ భారతం, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కడప నగరంలో నిర్వహిస్తున్న 21వ సబ్‌ జూనియర్‌ నేషనల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు కడప నగరంలో దిగినప్పటి నుంచి వారు బస చేసే ప్రాంతం వరకు వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. వారు టిఫిన్, భోజనం చేసేందుకు మైదానం ఆవరణలోకి వచ్చేందుకు కూడా వాహనాలు ఏర్పాటు చేశారు. మ్యాచ్‌ అనంతరం తిరిగి వెళ్లేందుకు కూడా వ్యక్తిగతంగా వాహనాల ద్వారా వారిని వారి బస కేంద్రాల వద్దకు చేరుస్తున్నారు. ఇక హెల్ప్‌డెస్క్‌ సైతం ఉదయం నుంచి రాత్రి వరకు సేవలందిస్తుండటం గమనార్హం. 22 అధికార భాషలు.. మరో 15 వరకు అనధికార భాషలు.. విభిన్న వస్త్రధారణ, వేషధారణ, వేర్వేరు సంస్కృతులు కలిగిన వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, తల్లిదండ్రులు నిర్వాహకుల ఏర్పాట్లు బాగున్నాయంటూ.. అందిస్తున్న సౌకర్యాలు.. మర్యాదలకు ఫిదా అయ్యామంటున్నారు. బాయ్‌ నుంచి విచ్చేసిన పరిశీలకుడు ఒ.డి శర్మ సైతం క్రీడాకారులతోపాటు తానూ కూర్చుని భోజనం చేస్తూ బాగున్నాయంటూ కితాబునిచ్చారు. ఇక జిల్లా అధికారులు సైతం అప్పుడప్పుడూ భోజన కేంద్రాన్ని పరిశీలిస్తూ వారు కూడా భోజనం చేస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తుండటం విశేషం.

హోస్ట్‌– గెస్ట్‌.. రిలేషన్‌ బాగుంది
గెస్ట్‌గా వచ్చిన మా లాంటి వారందరికీ హోస్ట్‌ చేస్తున్న బ్యాడ్మింటన్‌ నిర్వాహకులకు మధ్య రిలేషన్‌ బాగుం ది. మేము స్టేడియంకు రా వడానికి వెళ్లడానికి.. ప్రత్యేకంగా వాహనాలు ఇచ్చారు. టోర్నమెంట్‌ కూడా చాలా బాగా సాగుతోంది. మా చిన్నారి కోసం నేను కూడా వచ్చాను. 
– సోనియా గోస్వామి, జానీపూర్, జమ్మూ కశ్మీర్‌

చక్కటి ఏర్పాట్లు చేశారు
నా కుమారుడు జయేష్‌ నేషనల్స్‌ ఆడుతుంటే అతనికి తోడుగా వచ్చాను. చా లా దూరం నుంచి వస్తున్న మాకు ఎలా ఉంటుందో అన్న సంశయం ఉండేది. అయితే ఇక్కడ ఏర్పాట్లు, నిర్వహణ తీరు చూశాక చాలా సంతోషం కలిగింది. చక్కటి ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులకు అభినందనలు. 
– మనీషా సంబగబడే, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌

మరిన్ని వార్తలు