అవస్థల్లో ఆమె

12 Mar, 2016 03:17 IST|Sakshi
అవస్థల్లో ఆమె

ప్రభుత్వ కార్యాలయూల్లో
మహిళలపై కొనసాగుతున్న వివక్ష
సిబ్బంది కొరతతో పెరిగిన  పని భారం

  
అవనిలో సగం..ఆకాశంలో సగం..పురుషుని జీవన గమనంలో సగం..పిల్లల భవిష్యత్ నిర్మాణంలో సగం..కుటుంబ బాధ్యతల్లో సగం ఇదీ అబలల బలం..వంటింటి కుందేలు అనే నానుడిని చెరిపేస్తూ నేడు వనితలు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు..ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేటు రంగంలోనూ తమదైన ముద్ర వేస్తూ సత్తా చాటుతున్నారు..ఇదంతా బాగానే ఉన్నా నేడు ప్రభుత్వ కార్యాలయూల్లో ఉద్యోగినులు పని ఒత్తిడితో చిత్తవుతున్నారు.కొన్ని చోట్ల వివక్ష భూతంతో నిత్యం యుద్ధం చేస్తున్నారు.
 
 
గుంటూరు(నగరంపాలెం): జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో సుమారు 1000 నుంచి 1200 మంది వరకు నాన్ గెజిటేడ్ క్యాడరులో మహిళలు పని చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయూ శాఖల్లో పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పడుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్ ముందు ఒకే సీట్లో కూర్చొని ఉండడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నారు.

 కుటుంబానికి దూరంగా..
 పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు కారణంగా మహిళలు ఉద్యోగాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు చేయూల్సిన పని భారాన్ని ఒక్కరే మోస్తున్నారు. ట్రెజరీ, విద్యా శాఖ, ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ, జిల్లా పరిషత్, కలెక్టరేట్ తదితర శాఖల్లో ఒక్కోసారి రాత్రి ఏడు గంటల వరకు మహిళా ఉద్యోగినులు విధులు నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలోని మహిళా ఉద్యోగినులు అవస్థలు చెప్పనవసరం లేదు. ఈ-క్రాప్ బుకింగ్ ప్రారంభించాక ఈ రెండు శాఖల్లో మహిళల కష్టాలు రెట్టింపయ్యూరుు. వీరు ప్రతి పంటనూ ఫొటోలు తీసి సర్వర్‌కు అప్‌లోడ్ చేయూలి. ఇలా రోజంతా పొలాల్లోనే తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిగాక ఆఫీసుల్లో రాత్రి ఎనిమిది గంటల వరకు వివిధ కంప్యూటరీకరణ పనులు చేరుుస్తున్నారు.

 
 వేళాపాళాలేని సమావేశాలు
జిల్లా స్థాయి అధికారులు రాత్రి పొద్దుపోయే వరకూ వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ఆ సయయం వరకు మండల కేంద్రాల్లో ఉండి తిరిగి ఇంటికి వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని అధిక సంఖ్య ప్రభుత్వ కార్యాలయూల్లో మహిళలకు సరైన వసతులు లేవు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తో సహా ఎక్కడ ప్రత్యేక మరుగుదొడ్లుగానీ, రిటర్నింగ్ రూమ్‌గానీ లేదు. ఒకరిద్దరు మహిళా ఉద్యోగినులు పని చేస్తున్న కార్యాలయాల్లో వాటి ఊసే లేదు. 50 శాతం వరకు మహిళా ఉద్యోగులు పని చేస్తున్న కొన్ని కార్యాలయాల్లో వివక్షత కొనసాగుతుంది. ఉన్నతాధికారులు అడవారిని తక్కువగా చేసి మాట్లాడం, చిన్నతనంగా చూడటం, వీరితో పెట్టుకుంటే పనులు ముందుకు సాగవని నిరాశ చెందేలా వ్యవహరించడం చేస్తున్నారు. ఇవన్నీ దిగమింగి ఉద్యోగినులు విధులు నిర్వహిస్తున్నారు.

 ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఎక్కడ ?
 పని ప్రదేశంలో మహిళా ఉద్యోగినులు వేధింపులకు గురైతే..వారి రక్షణ కోసం 2013లో ఇంటర్నల్ కంప్లైట్ కమిటీ (ఐసీసీ), లోకల్ కంప్లైంట్స్ కమిటీలు నియమించారు. జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ చైర్ పర్సన్‌గా జిల్లా పరిపాలన అధికారి పర్యవేక్ష  ణలో ఈ కమిటీలు పని చేస్తారుు. ఇలాంటి కమిటీలు ఉన్నాయని ఇప్పటికీ అనేక మంది మహిళా ఉద్యోగినులకు తెలియదు. వివిధ శాఖలు ఏర్పాటు చేసుకొనే అసోసియేషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ..ఆయూ అసోసియేషన్లలో మహిళా ప్రతినిధులుగా ఒకరో, ఇద్దరో మాత్రం కనిపిస్తున్నారు. దీనితో ఉద్యోగినుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదు.  
  
 ఉద్యోగినుల్లో చైతన్య కోసం కృషి
జిల్లాలో మహిళా ఉద్యోగినుల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఉద్యోగినులకు వారి సమస్యలను చర్చించుకునేందుకు కూడా సమయం ఉండడం లేదు. రెండేళ్లుగా జిల్లాలో నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగినుల సమస్యల పరిష్కారం కోసం పది మందితో మహిళా విభాగం ఏర్పాటు చేశాం. అన్ని శాఖల్లో పని చేస్తున్న మహిళల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నాం. ఉద్యోగినులు పురుషులతో సమానంగా అసోసియేషన్ పాల్గొనాలి.      అనితా రోజ్‌రాణి,  ఏపీ ఎన్‌జీవోస్ మహిళా విభాగం చైర్‌పర్సన్

మరిన్ని వార్తలు