అమ్మో.. ఒకటో తారీఖు!

25 Aug, 2013 04:47 IST|Sakshi
(న్యూస్‌లైన్, శ్రీకాకుళం ఫీచర్స్, కలెక్టరేట్) :ప్రభుత్వోద్యోగులకు ఈ నెల జీతాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుండటం, ఖజానా శాఖ ఉద్యోగులెవరూ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ‘సెప్టెంబర్ ఒకటో తారీఖు’ ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడానికి సిద్ధమైపోతోంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవోలు గత 13 రోజులుగా సమ్మెలో ఉన్న విషయం విదితమే. గెజిటెడ్, జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం నుంచి సమ్మె చేస్తున్నారు. గురువారం వరకు విధులు నిర్వహిం చిన వీరికి కూడా జీతా లు వచ్చే పరిస్థితి లేదు.
 
 రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొం టామని ఎన్జీఓలు ప్రకటించి మరీ సమ్మెకు దిగారు. ఈ స్ఫూర్తిని ప్రదర్శించడంలో కొందరు ఉపాధ్యాయులు, లెక్చరర్లు తొలుత వెనుకంజ వేశారు. ఇప్పటికీ కొంతమంది టీచర్లు సమ్మెకు దూరం గా ఉన్నారు. వీరంతాజీతాలపై ఆశలు పెట్టుకున్నారనేది కాదనలేని సత్యం. సెప్టెంబర్ రెండోవారంలో వచ్చే వినాయక చవితి పండుగకు ఆర్థిక విఘ్నాలు తప్పకపోవచ్చని ఓ నాలుగో తరగతి ఉద్యోగి ‘న్యూస్‌లైన్’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
 
 జిల్లాలో పరిస్థితి ఇదీ..
 జిల్లాలో దాదాపు 23 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 13 సబ్ ట్రెజరీల ద్వారా వీరికి జీతభత్యాల పంపిణీ జరుగుతూ ఉంటుంది. సబ్ ట్రెజరీల్లోని నాన్ గెజిటెడ్ అధికారులంతా సమ్మెలోనే ఉన్నారు. వీరితోపాటు సబ్ ట్రెజరీ అధికారులు(ఎస్టీవోలు), సహాయ ట్రెజరీ అధికారులు(ఏటీవోలు) కూడా విధులకు హాజరు కావడం లేదు. వీరంతా సమ్మెలో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి. ‘మేం రోజూ కార్యాలయాలకు వెళుతున్నాం. తాళాలు వేసి ఉండటంతో హాజరుపట్టీలో సంతకాలు పెట్టే అవకాశం ఉండటం లేదు. అందుకే సమ్మెలో ఉన్నామో, లేదో చెప్పలేం’ అని ఓ సహాయ ట్రెజరీ అధికారి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ‘సిబ్బంది విధుల్లో లేకపోవడంతో ఈ నెల జీతాలు ఇవ్వలేం’ అని ఆయన అన్నారు.
 
 పోలీసులకు ఊరట..
 శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసు సిబ్బందికి మాత్రమే ఈ నెల జీతాలు అందనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయమై ఖజానాశాఖ డిప్యూటీ డెరైక్టర్ సదానందరావు ‘న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ సమ్మెలో ఉండటంతో ఈ నెల జీతభత్యాలు అందే పరిస్థితి లేదని వెల్లడించారు. పోలీసు శాఖకు మాత్రం మినహాయింపు ఉండవచ్చని, వాళ్లకు జీతాలు అందే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం నుంచి తుది ఉత్తర్వులు రావాల్సి ఉందని చెప్పారు.
 
 ఉద్యమం ఆగదు..
 ఈ నెల జీతభత్యాలు అందకపోయినా, ఉద్యమం ఆగదని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడం కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. ఏజేసీతోపాటు అన్నిశాఖల జిల్లా అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
 
>
మరిన్ని వార్తలు