మొద్దు నిద్ర వదిలిస్తా

16 Oct, 2014 00:46 IST|Sakshi
మొద్దు నిద్ర వదిలిస్తా
  • కనీస అవసరాలు తీర్చని ప్రభుత్వం
  •  ఎవరూ పట్టించుకోకపోయినా నేనున్నా
  •  తుపాను బాధితులకు వైఎస్ జగన్  భరోసా
  •  తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటన
  • సాక్షి, విశాఖపట్నం:‘సూరీడమ్మా..పోలమ్మా.. జోగమ్మా..పరసన్న.. అంతా కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. తుపాను వచ్చి నాలుగు రోజులైంది. ఇప్పటికీ బాధితులకు ప్రభుత్వం తిండి, గుడ్డ, నీరు ఇవ్వలేకపోతోంది. ఎవరు పట్టించుకున్నా. పట్టించుకోకపోయినా మీకు నేనున్నాను. మీ కు న్యాయం జరిగేలా చూస్తాను’ అని బాధితులకు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్, పెదజాలరిపేట, పెద్దగదిలి, చిన్నగదిలి ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి బాధితుల గోడు విన్నారు. జగన్ రాకతో ప్రజలు ధైర్యం తెచ్చుకున్నారు. ఇల్లు కూలిపోయి, వాహనాలు పాడైపోయి, బోట్లు మునిగిపోయి ఉపాధి కోల్పోయామని, పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు, రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా గంగలో కలిసిపోయాయని కన్నీరుమున్నీరయ్యారు.
     
    బాబు అయిదు నిమిషాలైనా లేడు

    ఉదయం ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్న జగన్ పోర్టులో ఎండు చేపలు అమ్ముకుంటూ బతుకుతున్న పుక్కళ్ల సత్యవతి, కొమరు అప్పాయమ్మ, పైడిపల్లి కాసులమ్మలను పరామర్శించారు. తుపానుకు బోట్లు కొట్టుకుపోయాయని, చేపలు పాడైపోయాయని వారు జగన్‌కు తెలిపారు. ‘చేపలు పోయాయి కదమ్మా ఎవరైనా వచ్చి చూశారా, ఏమైనా ఇచ్చారా’ అని జగన్ వారిని అడిగారు. ఎవరూ మీ ఇవ్వలేదని, చంద్రబాబు వచ్చి ఐదు నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయారని విలపించారు. అక్కడి నుంచి ముందుకెళ్లిన జగన్ సముద్రంలో మునిగిపోయిన బోట్లను పరిశీలించారు.
     
    నష్టపరిహారం కోసం ఒత్తిడి తెస్తా

    ప్రతి సారీ తుఫాన్లు వచ్చి ‘వెసల్స్’ మునిగిపోతున్నా తొలగించడం లేదని, వాటివల్లే తమ బోట్లు దెబ్బతింటున్నాయని మత్స్యకార సంక్షేమ నేతలు, సోనాబోటు యూనియన్ అధ్యక్షుడు పీసు అప్పారావు  జగన్ వివరించారు. తమ బోట్లకు బీమా చేయించాలంటే ఏటా రూ.60 వేలు కట్టాల్సి వస్తుందని, అంత వ్యాపారం లేకపోవడంతో ఎవరూ బీమా చేయించడం లేదని వివరించారు.
     
    ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా


    సోనా బోటుకు రూ.25లక్షలు, ఫైబర్‌బోటుకు రూ.2.5 లక్షలు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తానని జగన్ వారికి ధైర్యం చెప్పారు. దెబ్బతిన్న బోటు మరమ్మతులకు రూ.50 వేలు, వలలకు రూ.20 వేలతో పాటు ప్రతి కుటుంబానికి తక్షణమే రూ.5 వేలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. బోట్లే ఆధారంగా జీవిస్తున్న 20వేల మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వారి వృత్తిని కాపాడాలన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మీ అందరితో కలిసి రోడ్డుమీద కూర్చొని ధర్నాలు చేస్తానని, అధైర్య పడొద్దని చెప్పారు.

    కొవిరి నాయుడు అనే యువకుడు తాను బోటు కోల్పోయానని వివరించాడు. అక్కడి నుంచి జగన్ వెనుదిరిగి వెళ్తూ మార్గమధ్యంలో కరుకు ఎర్రమ్మ అనే వికలాంగ వృద్ధురాలి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెదజాలరిపేట (వాల్తేరు డిపో) చేరుకున్న జగన్ అక్కడ ప్రజల నరకాన్ని కళ్లారా చూశారు. కానూరి సరస్వతి ఇంట్లోకి వెళ్లి కూలిపోయిన పైకప్పును చూశారు. భర్త, ముగ్గురు పిల్లలు, అత్త ఆడపడుచుతో ఒకే ఇంట్లో ఉంటున్నానని, ఇప్పుడు అది కూడా పోయిందని ఆమె కన్నీటి పర్యంతమైంది.

    తమ వందలాది బోట్లు, వలలు పోయాయని, జనం ఆకలితో అలమటిస్తున్నారని కులపెద్ద తెడ్డు పరసన్న జగన్‌కు వివరించారు. ‘బాబూ నాకు రేషన్ కార్డులేదు, ఇల్లులేదు, ముగ్గురు పిల్లలను చదివించాలనుకుంటే ముందు ఫీజు లేదని ఇప్పుడు కట్టమంటున్నారు. ఎంతమంది కాళ్లు పట్టుకున్నా ఫలితం లేదు’ అని తాటిపూడి పైడిరాజ్ అనే మహిళ తన వెతలను వివరించింది. మా జీవితాలే పోయాయంటూ ఇంటర్మీడియేట్ విద్యార్ధిని వెగలపు భార్గవి జగన్ వద్ద వాపోయింది.

    గెలిచినోళ్లు పట్టించుకోలేదు

    ‘మేం ఓట్లేసి గెలిపించినోళ్లు మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు వచ్చారు నాయనా’ అని సొల్లు పోలమ్మ కృతజ్ఞతను వ్యక్తం చేసింది. మొబైల్ బండిలో మెషీన్ పెట్టుకుని పాత బట్టలు కుట్టుకుని జీవించే తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఇల్లు లేదని చోపేటి సూరీడమ్మ విలపించింది. జోగులు అనే వృద్ధుడు బోట్లు పోయాయని చెప్పడంతో ‘జోగులు తాతా..మనం ఇద్దరం ప్రతిపక్షంలోనే ఉన్నాం..పోరాటం చేస్తేనే ఏమైనా సాధించుకోగలం. కనీసం జగన్ వస్తున్నాడని తెలిసి మిమ్మల్ని ప్రభుత్వం పట్టించుకుంటుందనే నేను వచ్చాను. మన ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక ఒక్క నెలలో మీ సమస్యల్ని పరిష్కరిద్దాం’ అని జగన్ హామీ ఇచ్చారు.
     
    పార్టీ తరపున ఆదుకుంటా


    మధ్యాహ్నం పెద్దగదిలి, చిన్నగదిలి ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. సింహగిరికాలనీలో ప్రతి ఇంటికి వెళ్లారు. తొంభై ఏళ్ల రెడ్డిపైడితల్లమ్మ తన పింఛన్ తీసేశారని జగన్‌కు చెప్పుకుంది. తనకు తండ్రి లేడని, ముగ్గురు పిల్లలతో మా అమ్మ కష్టాలు పడుతోందని తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం.సుధ జగన్‌కు తెలిపింది. కర్రి భవాని అనే పద్నాలుగేళ్ల బాలిక, కండేల లక్ష్మి అనే మహిళ చెవిటి, మూగ బాధితులని తెలిసి జగన్ చలించిపోయారు.

    వారిని పార్టీ తనపున అన్ని విధాలా అదుకుంటామని భరోసా ఇచ్చారు. పెదగదిలి సాయిబాబా గుడి వద్ద ఇంటి గోడకూలి చనిపోయిన కుమారి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. కొండలపైకి ఇరుకు సందుల గుండా కాలినడకన వెళ్లి అందరితో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని చూసి వారి కష్టాలు తెలుసుకున్నారు. రాత్రి అంధకారంలోనూ జగన్ పర్యటించి నగరానికి చేరుకున్నారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శు లు ధర్మాన ప్రసాదరావు,  గొల్లబాబూరావు, తలశిల రఘురాం, నియోజక వర్గ సమన్వయకర్తలు కోలా గు రువులు, వంశీకష్ణ, చొక్కాకుల వెంకట్రావు, కర్రి సీతారాం, తిప్పల నాగిరెడ్డి, మళ్ల విజయప్రసాద్, ఉమాశంకర్ గణేష్, పార్టీ నేతలు తైనాల విజయకుమార్, హ నోక్, సత్తి రామకష్ణారెడ్డి, కోరాడ రాజబాబు,కొయ్యా ప్రసాదరెడ్డి, రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
     

>
మరిన్ని వార్తలు