మూడు ముక్కలాట | Sakshi
Sakshi News home page

మూడు ముక్కలాట

Published Thu, Oct 16 2014 12:55 AM

మూడు ముక్కలాట

వన్డే ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో భారత్ చివరి సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ద్వారా ఒకట్రెండు ఖాళీలను పూరించాలనేది సెలక్టర్ల ఉద్దేశం. అయితే ప్రస్తుతం బ్యాటింగ్, పేస్ విభాగం కంటే స్పిన్నర్ల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ప్రపంచకప్‌కు వెళ్లే మూడో స్పిన్నర్ ఎవరు? అమిత్ మిశ్రా దాదాపుగా జట్టులో ఉండటం ఖాయమే అనుకుంటున్న సమయంలో... కుల్దీప్, అక్షర్ పటేల్‌లను జట్టులోకి తెచ్చి సెలక్టర్లు కాస్త అయోమయం సృష్టించారు.
 
 సాక్షి క్రీడావిభాగం
 అశ్విన్, రవీంద్ర జడేజా... ఈ ఇద్దరూ ప్రపంచకప్ ఆడటం ఖాయమే. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరూ తుది జట్టులో ఉండటం ఖరారే. అయితే వీళ్లతో పాటు రిజర్వ్‌గా ఆస్ట్రేలియా వెళ్లే మూడో స్పిన్నర్ ఎవరనే విషయంలో స్పష్టత లేదు. స్పిన్నర్‌ను పరీక్షించాలనుకుంటే భారత్‌లో జరిగే మ్యాచ్‌లనే చూడాలి. అందుకే వెస్టిండీస్‌తో సిరీస్‌ను దీనికి వేదికగా సెలక్టర్లు నిర్ణయించుకున్నారు. అయితే అసలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో మైదానాల స్వభావం, బౌండరీల సైజు దృష్ట్యా ముగ్గురు స్పిన్నర్లు అవసరమా అనేది మరో ప్రశ్న.

ఒకవేళ అవసరం అనుకుంటే... ప్రస్తుతానికి అమిత్ మిశ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రేసులో ఉన్నారు. కరణ్ శర్మకూ ఎంతో కొంత ఆశ ఉంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు అశ్విన్‌కు విశ్రాంతి ఇవ్వడం వెనక సెలక్టర్ల ఉద్దేశం ఏమిటో స్పష్టత లేదు. అశ్విన్ ప్రపంచకప్‌కు అవసరం లేదు అనుకున్నారా? లేక మిగిలిన వాళ్లను పరీక్షించడానికి విశ్రాంతి ఇచ్చారా? అంటే రెండో ప్రశ్నే ముందుకు వస్తుంది. అశ్విన్ గత ఆరు నెలలుగా అలసిపోయే స్థాయి క్రికెట్ ఆడలేదు. గత ప్రపంచకప్ జట్టులో ఉన్న ఈ చెన్నై ఆఫ్ స్పిన్నర్ ప్రపంచకప్ ఆడటం ఖాయమే. ఆల్‌రౌండర్‌గా జడేజా స్థానానికి ఢోకా లేదు.

 ఎవరిని ఆడిస్తారో?
 వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం భారత్ వ్యూహాలను దెబ్బ తీసింది. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి ఉంటే... కచ్చితంగా చివరి రెండు వన్డేల్లో కొత్త వాళ్లను పరీక్షించే అవకాశం ఉండేది. విశాఖ వన్డే రద్దు కావడం వల్ల ఓ మ్యాచ్ చేజారింది. ఇక చివరి రెండు వన్డేల్లోనూ గెలిస్తేనే సిరీస్ గెలుస్తారు. కాబట్టి ప్రయోగాలు చేయడం కొద్దిగా కష్టం. అందులోనూ నాలుగో వన్డే ఆడే ధర్మశాల ఫాస్ట్ బౌలింగ్ వికెట్ అని చెబుతున్నారు.

కాబట్టి జడేజా ఒక్కడినే స్పిన్నర్‌గా పరిమితం చేసి నలుగురు పేసర్లతో ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు స్పిన్నర్లను పరీక్షించడానికి ఒక్క మ్యాచ్ మాత్రమే మిగులుతుంది. ఒకవేళ అక్షర్ పటేల్, కుల్దీప్‌లలో ఎవరినైనా ప్రపంచకప్ ఆడించాలనుకుంటే... కచ్చితంగా జడేజా, మిశ్రాలను ఆపి వీళ్లిద్దరినీ బరిలోకి దించాలి. కానీ ఇలాంటి ప్రయోగం వల్ల సిరీస్ ఓడితే మళ్లీ విమర్శలు మొదలవుతాయి. కాబట్టి ధోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరం. సెలక్టర్ల నుంచి కెప్టెన్‌కు ఎలాంటి సందేశం వెళుతుందో చూడాలి.
 
 అమిత్ మిశ్రా: గత రెండేళ్లుగా భారత్‌కు రిజర్వ్ స్పిన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. అశ్విన్ గైర్హాజరీలో ఆకట్టుకున్నాడు. కానీ ఇంగ్లండ్ వెళ్లలేదు. గాయం కారణంగా తనని ఎంపిక చేయలేదని అప్పుడు సెలక్టర్లు చెప్పారు. ఇక వెస్టిండీస్‌తో సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడాడు. కొచ్చిలో ఫ్లాట్ వికెట్ మీద రాణించలేకపోయాడు. భారీగా పరుగులు ఇచ్చాడు. కానీ ఢిల్లీ వన్డేలో స్పిన్ పిచ్ మీద చెలరేగిపోయాడు. అయితే బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో బలహీనం. ఇది తన అవకాశాలను దెబ్బతీయొచ్చు.
 
 కుల్దీప్ యాదవ్: ఇప్పటివరకూ ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కూడా ఆడకుండా భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఆసియాలో తొలి చైనామన్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న ఈ 19 ఏళ్ల కుర్రాడు... ఫీల్డింగ్‌లో కాస్త వీక్. అయితే తన భిన్నమైన శైలి ప్రపంచకప్‌లో భారత్‌కు లాభం చేకూరుస్తుందని భావిస్తే తను ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడు. కానీ ఏ మాత్రం అనుభవం లేని కుల్దీప్‌ను తీసుకెళ్లడం కూడా లాటరీ లాంటిదే. చివరి రెండు వన్డేలు అవకాశం లభించి, తనేదైనా సంచలనం చేస్తే తప్ప ప్రస్తుతానికి అవకాశాలు తక్కువే.

అక్షర్ పటేల్: తొలి మూడు వన్డేల కోసం 14 మందితోనే జట్టును ప్రకటించిన భారత సెలక్టర్లు చివరి రెండు మ్యాచ్‌ల కోసం ఈ సంఖ్యను 15కి పెంచారు. ఒకవేళ పటేల్‌ను ప్రపంచకప్ కోసం పరీక్షించాలనుకుంటే ముందే తీసుకోవాల్సింది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో ఉపయుక్తమైన బ్యాట్స్‌మెన్ కావడం, మైదానంలో చురుగ్గా కదలడం... రేసులో అక్షర్ పటేల్‌ను ముందుకు తీసుకొచ్చాయి. పటేల్ జట్టుతో పాటు ఉండటం కచ్చితంగా మిశ్రాపై ఒత్తిడిని పెంచే అంశమే.

Advertisement
Advertisement