అసలు ‘భూతం’ అతడేనా! | Sakshi
Sakshi News home page

అసలు ‘భూతం’ అతడేనా!

Published Thu, Oct 16 2014 12:58 AM

అసలు ‘భూతం’ అతడేనా! - Sakshi

 సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒకే ఊరు.. ఒకటే వర్గం.. వృత్తికూడా ఒకటే. వారంతా ఆర్థికంగా బలపడిన వారే. రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో స్పర్థలు తలెత్తాయి. అంతే.. ఓ రాజకీయ పార్టీ నాయకుడు రంగప్రవేశం చేశాడు. రెండువర్గాల మధ్య దూరం పెంచాడు. సమస్యను రావణ కాష్టంలా రగిలించాడు. హత్యల పరంపర మొదలైన తర్వాత తనకేమీ సంబంధం లేదన్నట్టు తెరవెనక్కి వెళ్లిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన పెదవేగి మండలం పినకడిమికి చెందిన వ్యక్తుల హత్యాకాండపై పోలీసు అధికారులు విచారణ చేపట్టగా.. వారికే కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూసినట్టు విశ్వసనీ యంగా తెలిసింది. ఆర్థికంగా బలపడిన ఇరువర్గాల మధ్య ఘర్షణలు పెంచి.. ఆనక పంచాయతీల పేరుతోరూ.లక్షలు దండుకున్నాడని పోలీసులు ప్రాథమికం గా నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
 
 ఆరు నెలల క్రితం పంచాయతీ ఎన్నికల్లో పినకడిమి సర్పంచ్ పదవికి మాజీ ఎంపీటీసీ పామర్తి వెంకటేశ్వరరావు పోటీ చేయాలనుకున్నారు. తొలుత వెంకటేశ్వరరావుకు మద్దతిస్తానని చెప్పిన జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు ఆ తర్వాత మరో అభ్యర్థికి మద్దతిచ్చారు. ఎన్నికల్లో దుర్గారావు మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపొందడంతో పామర్తి వెంకటేశ్వరరావు దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి ఎదుట పంచాయతీ పెట్టాడు. సదరు నేత దుర్గారావును పిలిపించి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన వెంకటేశ్వరరావుకు రూ.మూడు లక్షలు ఇవ్వాల్సిందిగా సెటిల్‌మెంట్ చేశారు. అందుకు సరేనన్న దుర్గారావు ఆ తర్వాత వెంకటేశ్వరరావు ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు. డబ్బులు ఇవ్వకపోగా, ఓసారి ఇదే విషయమై ఇంటికి వెళ్లిన వెంకటేశ్వరరావును అవమానించంతో అత డు పగపెంచుకున్నా డు.
 
 విషయాన్ని సదరు నేత వద్దకు తీసుకువెళ్లినా పట్టిం చుకోలేదు. పైగా, సార్వత్రిక ఎన్నికల్లో తన అవసరాల కోసం దుర్గారావు నుంచే ఆ నేత రూ.కోటి విరాళం తీసుకున్నాడన్న ప్రచారం జరిగింది. దీంతో ఆ నాయకుడి వల్ల తనకు న్యాయం జరగదని తేల్చుకున్న వెంకటేశ్వరరావు అదును కోసం వేచిచూస్తున్న సమయంలోనే తూరపాటి నాగరాజు అతనితో జత కలిశాడు. నాగరాజు కుమారుడికి, భూ తం దుర్గారావు సోదరుడు గోవింద్ కుమార్తెకు ప్రేమ వివాహం జరగ్గా.. తదనంతర పరిణామాల్లో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు, నాగరాజు కలిసి ముందుగా ఏప్రిల్ 6న భూతం దుర్గారావును హతమార్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
 
 ఈ కేసులో ప్రధాన నిందితుడు  నాగరాజు పరారైనా, పామర్తి వెంకటేశ్వరరావు మాత్రం పోలీసులకు పట్టుబడ్డాడు. వాస్తవానికి నాగరాజు తొలుత పట్టుబడినా లక్షలాది రూపాయలు మింగిన పోలీసులు పథకం ప్రకారం 20రోజుల తర్వాత అతన్ని తప్పిం చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది. 20 రోజులపాటు పాటు కస్టడీలో ఉన్న నాగరాజు సదరు రాజకీయ నాయకుడికి తెలియకుండా తామేమీ చేయలేదని పోలీసులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. అప్పట్లో దీనిపై పెద్దగా దృష్టిపెట్టని పోలీసులు పెదఅవుట పల్లి వద్ద ముగ్గురి హత్య నేపథ్యంలో ఆ నాయకుడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
 

Advertisement
Advertisement