కామన్‌వెల్త్ చాంపియన్ శిరీషకు ఘన సన్మానం

7 Dec, 2013 06:00 IST|Sakshi

కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ :  కామన్‌వెల్త్ చాంపియన్ శిరీషను ఆదర్శంగా తీసుకుని పతకాల పంట పండించాలని వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు జెడ్పీ సీఈఓ మాల్యాద్రి సూచించారు. కడపలోని వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్‌లో స్పెషలాఫీసర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో మూడు స్వర్ణపతకాలు సాధించిన జిల్లా క్రీడాకారిణి శిరీషను శుక్రవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఈఓ మాట్లాడుతూ క్రీడాకారులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు నిరంతర సాధన చేయాలన్నారు. స్పోర్ట్స్ స్కూల్‌లో జెడ్పీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. వల్లూరు మండల అభివృద్ధి నిధుల నుంచి ఆమెకు రూ.10 వేలు నగదు ప్రోత్సాహం అందజేస్తామని ప్రకటించారు.

 జిల్లా క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ కొనియాడారు. పట్టుదలతో మంచి ఫలితాలు సాధించిన శిరీష ఒలంపిక్స్‌లో పతకం సాధించాలని ఆకాంక్షించారు. శిరీషకు జిల్లా అధికారుల తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చూస్తామని సభలో ప్రకటించారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అంటే మామూలు విషయం కాదని వల్లూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్ అన్నారు. వల్లూరు మండలం పెద్దపుత్తలో జన్మించిన శిరీష వల్లూరు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు గాను ఆమెకు ‘వల్లూరు క్రీడారత్నం’ బిరుదును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. అమ్మాయిలకు క్రీడలు ఎందుకు అని చాలామంది నిరుత్సాహ పరచినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను క్రీడల్లో రాణిస్తున్నట్లు  శిరీష తెలిపారు.

కోచ్‌లు, అధ్యాపకుల సహకారంతో మరిన్ని పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అనంతరం ఆమెను సన్మానించడంతో పాటు నగదు బహుమతిని అందించారు. శిరీష తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, వెంకటశివారెడ్డి, స్పోర్ట్స్ స్కూల్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వై.భాస్కర్‌రెడ్డి, కోచ్‌లు నౌషాద్, రంగనాథరెడ్డి, అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు