ఉపాధి పనులకు గ్రీన్‌సిగ్నల్

1 Dec, 2013 03:28 IST|Sakshi
రానున్న ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ పథ కం పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 16 రకాల కొత్తపనులను కూడా ఈ పథకంలో చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో చేపట్టదలచిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని డ్వామా అధికారులకు ఆదేశాలు అందాయి
 
 కొత్త పనులు ఇవీ...
 గ్రామాల్లోని ఉమ్మడి భూముల్లో పొదలు, ముళ్లకంపల తొలగింపు, భూమి చదను, చేపలు, రొయ్యల చెరువుల్లోని పూడిక తొలగింపు, కంపోస్టు పిట్‌ల తవ్వకం వంటి పనులు చేపట్టవచ్చు. అంతేకాకుండా రైతులకు ప్రయోజనం చేకూర్చేవిధంగా సాగునీటి డ్రెయిన్లు, కాలువలు, ప్రాజెక్టుల్లోని గుర్రపుడెక్క తొలగింపు పనులను సైతం ఉపాధి హామీ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. మంచినీటి చెరువులతోపాటు రజకుల, దూడల చెరువుల్లో పూడిక, రోడ్లకు అడ్డంగా ఉండే పొదల తొలగింపు పనులతోపాటు నేల నూతుల బాగుసేత, కొబ్బరిచెట్ల పెంపకం, వర్షాలు, వరదలకు గండ్లు పడిన చెరువుల అభివృద్ధి వంటి పనులను ఈ పథకం కింద చేపట్టవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు చెందిన వర్షాధార మెట్ట భూముల అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఉద్యాన పంటల అభివృద్ధి, గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు(ఆర్‌సీపీ) పనులకు కూడా ఉపాధి హామీ పథకంలో అవకాశం కల్పించారు.
 
 మనసు పెడితే ఇవన్నీ మంచి పనులే
 ఉపాధి హామీ పథకం కూలీలకు ప్రయోజనం కల్పించినా.. ఊరికి లేదా ఓ ప్రాంతానికి పెద్దగా ఉపయోగపడలేదన్న విమర్శలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో కొత్త పనులకు కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ పథకం వల్ల జిల్లాకు ప్రయోజనం చేకూరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అరుుతే, అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే తప్ప పథకం లక్ష్యం నెరవేరదని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలోని 29 డెల్టా మండలాల్లో 11 ప్రధాన కాలువలు, కొల్లేరు పరిసరాలు, ఇతర ప్రాంతాల్లోను  67 డ్రెయిన్లు ఉన్నాయి. వీటిల్లో గుర్రపుడెక్క, తూడు తొలగించుకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. అదేవిధంగా 1,433 రక్షిత మంచినీటి పథకాలు ఉండగా, వీటికోసం 509 మంచినీటి చెరువులు, 500కుపైగా రజక, దూడల చెరువులు ఉన్నారుు. వీటిలో చాలాచోట్ల ఇసుక/మట్టి మేటలు వేసి పూడుకుపోయూరుు. ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా వినియోగించుకుంటే వీటిని ప్రక్షాళన చేసుకునే అవకాశం కలుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతుల భూములను చదును చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో అవన్నీ సాగుకు దూరంగా ఉన్నారుు. ఈ పథకం ద్వారా ఆ భూములను సాగులోకి తెస్తే కూలీలకు ఉపాధితోపాటు సంబంధిత రైతులకు శాశ్వత ఉపాధి కలుగుతుంది. కొత్త పనులపై అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు దృష్టి సారిస్తే ఈ పథకం బహుళ ప్రయోజనకారిగా మారుతుందనడంలో సందేహం లేదు.
 
మరిన్ని వార్తలు