‘గిన్నిస్’ దిశగా పొట్టి ఆవు అడుగులు

7 Nov, 2014 04:48 IST|Sakshi
కసర్‌గడ్ ఆవుతో డాక్టర్ ప్రతాప్, రైతు శ్యామ్‌ప్రసాద్

చిత్రంలో కనిపిస్తున్న ఈ ఆవు పొట్టిగానే ఉన్నా దీని ఘనత ఎంతో గొప్పది. తన పొట్టి లక్షణంతోనే గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. కైకలూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన రైతు అట్లూరి శ్యామ్‌ప్రసాద్ దీనిని పోషిస్తున్నారు. ‘కసర్‌గడ్’ జాతికి చెందిన ఈ దేశీయ ఆవు ఎత్తు కేవలం 29 అంగుళాలు. ఈ ఆవును 2013 ఏప్రిల్‌లో కేరళ రాష్ట్రం కొట్టాయంలో కొనుగోలు చేసినట్లు శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. 86 కేజీల బరువుగల ఈ ఆవు ఇప్పటికి మూడు ఈతలల్లో మూడు దూడలకు జన్మనిచ్చిందన్నారు.

ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కలవపూడిలో జన్మభూమి సభ సందర్భంగా నిర్వహించిన పశుప్రదర్శన ఈ ఆవును ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. దీని ప్రాముఖ్యతను ముఖ్యమంత్రికి కైకలూరు పశువైద్యాధికారి సూరపనేని ప్రతాప్, అట్లూరి శ్యామ్‌ప్రసాద్ వివరించారు. ఇప్పటివరకు గిన్నిస్ రికార్డుల్లో కేరళకు చెందిన 33 అంగుళాల ఎత్తున్న ఆవుకు స్థానం దక్కిందని ప్రతాప్ తెలిపారు.

కసర్‌గడ్ ఆవు పాలల్లో అల్ఫా-2 కేసీన్ ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని వివరించారు. మధుమేహం, రక్తపోటు నివారణకు ఈ పాలు దివ్వ ఔషధంలా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ ఆవు వివరాలను గిన్నిస్ బుక్‌లో నమోదుకు పంపాలని సీఎంను కోరామన్నారు. కసర్‌గడ్ సంతతి అభివృద్ధికి పరిశోధనలు జరపాలని సీఎం చంద్రబాబు పశువైద్యాధికారులను ఆదేశించినట్లు డాక్టర్ సూరపనేని తెలిపారు.
 -గోపవరం(కైకలూరు)

మరిన్ని వార్తలు