అలవాటు పడితే అంతే సంగతి

27 Apr, 2019 13:02 IST|Sakshi

మత్తును సొత్తు చేసుకుంటున్న వ్యాపారులు

యథేచ్ఛగా గుట్కా అమ్మకాలు

నీరుగారుతున్న నిషేధం

ఆరోగ్యానికి తూట్లు పొడిచే గుట్కాను ప్రభుత్వం నిషేధించింది. అయితే లాభార్జనే ధ్యేయంగా అక్రమార్కులు యథేచ్ఛగా దాన్ని విక్రయిస్తూ యువతను మత్తులో ముంచెత్తుతున్నారు. నిషేధం బూచి చూపి రేటును మరింత పెంచి విక్రయిస్తూ దోచుకుంటున్నారు.

తూర్పుగోదావరి, పిఠాపురం: ఆరోగ్యమే మహాభాగ్యం.. కానీ మత్తులో ఆనందాన్ని వెదుక్కుంటూ చేజేతులా ఆరోగ్యానికి తూట్లు పొడుచుకుంటున్నారు కొందరు యువత. ఒక గుట్కా ప్యాకెట్‌ సేవించడం వల్ల జీవిత కాలంలో ఒక గంట ఆయువు కోల్పోతారని వైద్యులు చెబుతున్నారు. గొంతు, నోటి క్యాన్సర్లు వస్తాయంటున్నారు. ఈ విషయాలన్నీ గుట్కా వినియోగదార్లకు తెలిసినప్పటికీ దానికి బానిసలై ఆ మత్తులో కూరుకుపోతున్నారు. యువత 32 శాతం వరకూ  గుట్కాకు బానిసలైనట్టు తెలుస్తోంది.  ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే గుట్కాను ప్రభుత్వం నిషేధించింది. దీన్ని సాకుగా చూపి కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి విక్రయిస్తూ వ్యాపారులు దోచుకుంటున్నారు. కోట్ల రూపాయల ఈ వ్యాపారం చాపకింద నీరులా సాగిపోతోంది. ఇటీవల పోలీసులు దాడులు ముమ్మరం చేసినా గ్రామాల్లో గుట్కా అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. వివిధ రకాల గోవా గుట్కాల అమ్మకాలు ఈ ఏడాది ఎక్కువగా పెరిగినట్టు వ్యాపారస్తులు చెబుతున్నారు. 

అలవాటు పడితే అంతే సంగతి
ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పటికీ ఒకసారి అలవాటు పడిన వారు దానికి బానిసలైపోతున్నారు.    గుట్కా సేవనానికి అలవాటు పడిన వ్యక్తి రోజూ ఐదు నుంచి 20 ప్యాకెట్ల వరకు వినియోగిస్తుంటాడు. ఇలా సగటున రోజుకు జిల్లాలో లక్షలాది ప్యాకెట్లు వినియోగిస్తున్నట్టు అంచనా. 

గుట్టుగా గుట్కా వ్యాపారం
నెల రోజులుగా గుట్కా రేట్లకు రెక్కలు వచ్చాయి. దీని విక్రయాలపై నిషేధం ఉండడంతో వినియోగదారులు ఎవరూ నోరు మెదపడం లేదు. దీంతో గుట్కా వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతున్నాయి. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో  ఈ వ్యాపారం చేసేవారు కుబేరులవుతున్నారు.

దాడులు చేసినా షరా మామూలే
గతంలో వారం రోజుల పాటు పోలీసులు గుట్కా అమ్మకాలపై దాడులు చేశారు. నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు సుమారు రూ. 60 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 20 మందిపై కేసులు నమోదు చేశారు. దాడుల నేపథ్యంలో జాగ్రత్తపడ్డ వ్యాపారులు తిరిగి అమ్మకాలు ప్రారంభించారు. దాడులు చేసిన తరువాత పట్టించుకోకోపోవడంతో గుట్కా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.

ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది
గుట్కా సేవిస్తే గొంతు, నోటి క్యాన్సర్లు వస్తాయి. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. గుట్కా సేవిస్తే తాత్కాలికంగా మత్తులో తూగటం తప్ప మరే ప్రయోజనమూ లేదు. దీనికి అలవాటుపడినవారు సంసారిక జీవనానికి తక్కువ రోజుల్లోనే దూరమవుతారు. ఈ అలవాటు నుంచి బయటపడేందుకు స్వయం నిర్ణయం ఎంతైనా అవసరం.–డాక్టర్‌ బీరావిజయశేఖర్‌

>
మరిన్ని వార్తలు