గుట్టురట్టు

3 Feb, 2016 03:38 IST|Sakshi
గుట్టురట్టు

 గత నెలలో ఆత్రేయపురంలో కల్తీ నెయ్యి తయారీ ఘటన మరువకముందే ఆలమూరు మండలంలోని మూలస్థానం అగ్రహారంలో మంగళవారం కల్తీ పాలతయారీ కుంభకోణం బయటపడింది. జాతీయ రహదారి పక్కనే చేస్తున్న కల్తీ పాల తయారీ స్థానికంగా సంచలనం సృష్టించింది. రోజుకు సగటున 500 లీటర్ల కల్తీ పాలు తయారు చేసి హోటళ్లకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును స్థానిక యువకులు రట్టు చేశారు. బయటపడిందిలా.. మూలస్థానం అగ్రహారంలోని స్థానిక చర్చి పక్క వీధిలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గానుగపల్లి వెంకటేశ్వరరావు, ఆలమూరు మండలంలోని పెనికేరుకు చెందిన లంకలపల్లి ఫణికుమార్ ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నారు. వారిద్దరూ గత నెల 25న పాలతో పన్నీర్, పాలకోవా తయారు చేసుకుని విక్రయించుకుని జీవనోపాధి పొందుతామని తెలపడంతో ఇంటి యజమాని మురమండ శ్రీనివాసు తన ఇల్లును అద్దెకు ఇచ్చారు.

అప్పటి నుంచి రోజూ ఒక ఆటోలో రెండు కేన్‌లతో పాలు తీసుకువస్తుండగా వెళ్లేటపుడు మాత్రం ఎనిమిది కేన్‌లలో పాలు తీసుకువెళుతున్నారు. వారం రోజుల నుంచి ఇదే విధంగా జరుగుతుండటంతో స్థానిక యువకులకు అనుమానం వచ్చి గ్రామస్తుల సహకారంతో మంగళవారం తయారీదారులను నిలదీశారు. దీనిపై పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గ్రామస్తులు ఇంట్లోకి వెళ్లి చూడగా కల్తీ పాల బండారం బయటపడింది. కల్తీ పాల తయారీకి వినియోగిస్తున్న పదార్థాలు, మిక్సీలు కంటబడటంతో స్థానికులు అవాక్కయ్యారు. తమను వదిలేస్తే ఊరు విడిచివెళ్లిపోతామని నిందితులు గ్రామస్తులను బతిమలాడారు. అయితే స్థానిక యువకులు వీరిని పోలీసులకు పట్టించారు.వ్యర్థాలు, రసాయనాలతో కల్తీ పాల తయారీ పంచదార, ఉప్పు, దుస్తులు ఉతికేందుకు వినియోగించే సర్ఫ్‌పొడి, తవుడుతో తయారు చేసిన వంటనూనెను తగిన మోతాదులో కలిపి కల్తీపాలను తయారు చేస్తారని తెలుస్తోంది.

ఈ మిశ్రమాన్ని మిక్సీలో కొద్దిసేపు తిప్పితే పాలుగా మారతాయని, వాటిలో రసాయనాలు కలిపితే చిక్కటి పాలు తయారవుతాయని చెబుతున్నారు. అయితే మిశ్రమం తయారీలో ప్లాస్టిక్ వ్యర్థాలు వినియోగిస్తున్నట్టు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తెలుస్తోంది. తయారు చేసిన కల్తీపాలను అసలు పాలతో కలిపి వీటిని బయటకు తరలిస్తారు. లీటరు కల్తీపాల తయారీకి రూ.5 నుంచి రూ.8 ఖర్చవుతుందని తెలిసింది. కొన్ని పట్టణాల్లోని హోటళ్లకు పాలను విక్రయిస్తున్నామని నిందితులు నాగేశ్వరరావు, ఫణికుమార్‌లు పోలీసులకు తెలిపారు.
 తయారీలో వినియోగిస్తున్న పదార్థాలు స్వాధీనం


 కల్తీ పాల తయారీలో వినియోగిస్తున్న సుమారు 50 కేజీల పంచదార, 20 కేజీల ఉప్పు, 30 కేజీల సర్ఫ్‌పొడి, 25 లీటర్ల తవుడు ఆయిల్ ప్యాకెట్లు, పాల డబ్బాలు, ఎనిమిది పాలకేన్‌లతో పాటు కల్తీ తయారీ మిశ్రమానికి వినియోగిస్తున్న ఐదు మిక్సీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే తయారు చేసిన సుమారు 50 లీటర్ల కల్తీపాలను సీజ్ చేశారు. కల్తీపాలను హోటళ్లకు సరఫరా చేస్తున్న ఆటోడ్రైవర్ బి.సత్తిపండుతో పాటు నిందితులైన నాగేశ్వరరావు, ఫణికుమార్‌లను ఎస్సై ఎం.శేఖర్‌బాబు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కల్తీపాలను పరీక్షల నిమిత్తం పుడ్ సేఫ్టీ అధికారుల వద్దకు పంపిస్తామన్నారు. నిందితులు కల్తీపాలను, కోవాను ఇక్కడే చేస్తున్నారా లేక ఇతర ప్రాంతాల్లో బ్రాంచీలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు