సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో

2 Aug, 2013 03:59 IST|Sakshi

నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ జలాశయానికి వరదనీరు పోటె త్తుతోంది. శ్రీశైలంనుంచి సాగర్‌కు 4,79,065 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండడంతో గురువారం సాయం త్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 545 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో ఇదేమాదిరిగా కొనసాగితే మూడు నాలుగు రోజుల్లో ప్రాజెక్టులోకి పూర్తిస్థాయి నీటిమట్టం చేరనుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఉన్న 12గేట్లలో 10 గేట్లను 10అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.
 
 గత 24గంటల్లో నాగార్జున సాగర్ జలాశయంలో 18అడుగుల నీటిమట్టం పెరిగింది. గురువారం సాయంత్రానికి నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 544.60 అడుగులకు చేరింది. నేటి ఉదయానికి 555 అడుగులకు చేరే అవకాశం ఉంది. ఈసారి నాగార్జున సాగర్ జలాశయంలోని నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే రెండోపంట రబీలో కూడా వరిసాగుకు నీరిచ్చే అవకాశం ఉంది.  
 
 సాగర్ ఎడమ కాల్వకు నేడే నీటి విడుదల
 సాగర్ ఎడమ కాల్వకు శుక్రవారం నీటిని విడుదల చేసేందుకు ఎన్‌ఎస్‌పీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు  రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి కుందూరు జానారెడ్డిలు నీటిని విడుదల చేయనున్నారు. వాస్తవానికి సాగర్ ఎడమ కాల్వకు ఈ నెల ఒకటినే నీరు విడుదల చేయాల్సి ఉన్నా మంత్రి జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డిలు సమయం ఇవ్వకపోవడంతో నీటి విడుదలను ఒక్కరోజు వాయిదా వేశారు. రెండు సంవత్సరాల తరువాత నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు