అతివలకు అండగా..

21 Jul, 2019 03:33 IST|Sakshi

మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించేందుకు సర్కారు కసరత్తు 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ‘శక్తి టీమ్స్‌’ విస్తరణ 

రంగంలోకి మహిళా పోలీస్‌ వలంటీర్లు, మహిళా మిత్రలు 

మహిళల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు ‘హెల్ప్‌లైన్‌’ 

అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేలా మూడు యూనిట్లకు జవసత్వాలు

సాక్షి, అమరావతి: మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 82,502 కేసులు నమోదు కాగా.. వాటిలో అత్యాచారాలు, వేధింపులు, దాడులు, అవమానాల వంటి కేసులు 44,780 ఉండటం గమనార్హం. గతేడాది జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో ఉంది. 2014 నుంచి 2018 డిసెంబర్‌ వరకు మహిళలపై నేరాలను గమనిస్తే ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న మహిళా పోలీస్‌ టీమ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు కొత్తగా మరిన్ని చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో 18 యూనిట్లలో ఏర్పాటైన శక్తి టీమ్స్‌ (మహిళా పోలీస్‌ కానిస్టేబుళ్ల బృందాలు)ను రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ప్రధానంగా పట్టణాల్లోని విద్యాలయాలు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్ల వద్ద కాపుకాసే మహిళా పోలీస్‌ టీమ్‌లు పోకిరిల పనిపట్టనున్నాయి. మహిళలపై దాడులు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఇవి పనిచేస్తాయి. 

పోలీస్‌ వలంటీర్లు, మహిళా మిత్రల నియామకం 
వివిధ సమస్యల బారిన పడుతున్న మహిళలకు అండగా ఉండేలా ప్రత్యేకంగా మహిళా పోలీస్‌ వలంటీర్లు, మహిళా మిత్రలను ప్రభుత్వం నియమిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 18,512 మంది మహిళా పోలీస్‌ వలంటీర్ల నియామకం, నిర్వహణ కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.  ప్రస్తుతం విజయవాడలో నేర విచారణ, బాధితుల సంరక్షణ కోసం అంతర్జాతీయ ఫౌండేషన్‌ సహకారంతో మహిళా పోలీస్‌ వలంటీర్ల వ్యవస్థ నడుస్తోంది. వారితోపాటు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలకు చెందిన మహిళా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యోగులు, విద్యార్థినులతో ‘మహిళా మిత్ర’ బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళా చైతన్యానికి, వారికి అండగా నిలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

బాలికలు, మహిళల అక్రమ రవాణాకిక చెక్‌ 
రాష్ట్రం నలుమూలల నుంచి మహిళల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన స్పందించి వారికి రక్షణ కల్పించేలా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వíßహిస్తున్న హెల్ప్‌లైన్‌ 181, ఏపీ పోలీస్‌ హెల్ప్‌లైన్‌ 100, 1090, పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య, ఇతర అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్‌ 112 నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య మానవ అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల అక్రమ రవాణాను నివారించేలా ఏలూరు, గుంటూరు, అనంతపురంలలో ఉన్న మూడు ప్రత్యేక యూనిట్లకు జవసత్వాలు కల్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మరోవైపు సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రచార సాధనాల్లో మహిళలు, బాలికలకు సంబంధించిన అసభ్య పోస్టింగ్‌లు, ట్రోలింగ్‌లు, కించపరిచే వ్యాఖ్యానాల మూలాలను గుర్తించి అడ్డుకోవడంపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం మహిళలు, చిన్నారులపై సైబర్‌ క్రైమ్‌ నిరోధానికి నాలుగు సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.38.85 లక్షలను బడ్జెట్‌లో కేటాయించడం విశేషం.  

మరిన్ని వార్తలు