బుల్లి చేతులు.. బడా ఆవిష్కరణలు

2 Oct, 2017 16:10 IST|Sakshi
ఇంజినీరింగ్‌ విద్యార్థులు తయారు చేసిన బ్యాటరీ వాహనం

విజయనగరంఅర్బన్‌ : వారంతా పదో తరగతిలోపు విద్యార్థులు. కానీ వాళ్ల ఆలోచనలు మాత్రం శాస్త్రవేత్తలను తలపించాయి. సందర్శకులను అబ్బుర పరిచాయి. విజయనరం ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక కోటలోని ఆదివారం నిర్వహించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో వివిధ పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు 66 వైజ్ఞానిక పరిశోధనా నమూనాలను ప్రదర్శించారు. వ్యవసాయ రంగం నుంచి అంతరిక్షయానం వరకు అన్ని అంశాలకు చెందిన నమూనాలు ఆకట్టుకున్నాయి. గంట్యాడ జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన ‘వ్యర్థ పదార్థాలతో ఇటుకల తయారీ’, లొట్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘చెరకు పంట–పొదుపైన సాగు’, న్యూ సెట్రల్‌ స్కూల్‌ విద్యార్థుల ‘పెరటి సాగు నీటి పొదుపు’, ఫోర్ట్‌ సిటీ స్కూల్‌ విద్యార్థుల ‘అంతరిక్షయానంలో శాటిలైట్స్‌’ ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకొన్నారు.

తొలుబొమ్మల ద్వారా గ్రామీణ వాతారణలో ప్రజాజీవనం, మహారాజా అటానమస్‌ కళాశాల వివిధ విభాగాల ప్రయోగశాలను ప్రదర్శనలో ఉంచారు. ఫిజిక్స్‌ విభాగంలో భౌతిక శాస్త్రంలోని తాజా పరిశోధనలు పెట్టారు. కళాశాలకు చెందిన యంగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బృందం తయారు చేసిన మహిళా అలంకార వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల బ్యాటరీ బైక్‌ నమూనా, ఎంఆర్‌పీజీ కళాశాల ఎకనమిక్స్‌ విద్యార్థుల జీఎస్‌టీపై అవగాహన సదస్సు, ఎంఆర్‌ అటానమస్‌ కళాశాల విద్యార్థుల కరెన్సీ నోట్ల ప్రదర్శన, విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన సందర్శులకు ఆహ్లాదాన్ని పంచాయి.

ఆకట్టుకున్న టెర్రాకోట మట్టి కళాకృతులు
పట్టణంలోని ఏటీకె సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమం పొందుతున్న వృద్ధులు తయారు చేసిన టెర్రాకోట మట్టి కళాకృత్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఖలీలుల్లా ఫరీఫ్, ప్రధాన కార్యదర్శి ఎం.విజయభాస్కర్‌ ప్రోత్సహంతో ఆశ్రమంలో ఉన్న వృద్ధులు ఈ కళాకృత్యాలను తయారు చేశారు. ఇంట్లో అలకంరణ వస్తువుల నుంచి విని యోగపు వస్తువుల వరకు పలురకాల ప్రదర్శనలో ఉంచారు.

మరిన్ని వార్తలు